Virat Kohli:
టీమ్‌ఇండియా త్రో డౌన్ స్పెషలిస్టుల వల్లే తాను మెరుగైన బ్యాటర్‌గా మారానని విరాట్ కోహ్లీ అంటున్నాడు. తన పరుగుల వరదకు వారే కారణమని పేర్కొన్నాడు. నెట్స్‌లో వారు విసిరే బంతుల వల్లే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నానని ప్రశంసించాడు. ఈ తెరవెనుక హీరోలను అభిమానులు గుర్తుంచుకోవాలని సూచించాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ విజయం తర్వాత శుభ్‌మన్‌తో కలిసి విరాట్ మీడియాతో మాట్లాడాడు.
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. 391 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులు 22 ఓవర్లకు 73కే కుప్పకూలారు. మొదట విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగాడు. కేవలం 110 బంతుల్లో 13 బౌండరీలు, 8 సిక్సర్లతో 166 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా శుభ్‌మన్ గిల్ (116; 97 బంతుల్లో 14x4, 2x6) సెంచరీ అందుకున్నాడు. మ్యాచ్ ముగిశాక త్రో డౌన్ స్పెషలిస్టులు రాఘవేంద్ర, దయానంద్ గరానీ, నువాన్ సెనెవిరత్నెను విరాట్ ప్రశంసించాడు.
'మేం ఆడిన ప్రతిసారీ ఆ ముగ్గురూ మాకు ప్రపంచ స్థాయి ప్రాక్టీస్ అందిస్తారు. 145, 150 కిలోమీటర్ల వేగంతో నెట్స్‌లో బంతులేసి సవాల్ విసురుతారు. ప్రతిసారీ ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. నిత్యం మమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటారు' అని కోహ్లీ అన్నాడు.
'కొన్ని సార్లు తీవ్రత మరింత పెంచుతారు. నిజాయతీగా చెప్పాలంటే నా కెరీర్‌ను ప్రత్యేకంగా మార్చింది ఈ ప్రాక్టీసే. ఇలాంటి సాధన వల్లే నేనిలా ఉన్నాను. మా పరుగుల ఘనత వారికే చెందుతుంది. వాళ్లు ప్రతిరోజూ నమ్మశక్యం కాని విధంగా మాతో ప్రాక్టీస్ చేయిస్తారు. మీరంతా వారి పేర్లు, ముఖాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మా విజయాల వెనక వాళ్లే ఉంటారు. మా కోసం ఎక్కువ శ్రమిస్తారు' అని విరాట్ పేర్కొన్నాడు.
మరో సెంచూరియన్ శుభ్‌మన్ గిల్ సైతం త్రో డౌన్ సెషలిస్టులను అభినందించాడు. 'ఆ ముగ్గురూ కలిసి 1200-1500 వికెట్లు తీసుంటారు. మ్యాచుకు ముందు అన్ని రకాల పరిస్థితులకు మేం అలవాటు పడేలా చేస్తారు' అని వివరించాడు.