Sourav Ganguly on Sachin Tendulkar, Virender Sehwag: తన ఓపెనింగ్ భాగస్వాముల్లో సచిన్ తెందూల్కర్ అత్యంత తెలివైన, విచక్షణా పరుడని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇక డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెర్రిగా ఆడేవాడని వెల్లడించాడు. వయసు పెరిగే కొద్దీ ముత్తయ్య మురళీధరన్‌ను ఎదుర్కోవడం కష్టంగా మారిందన్నాడు. క్రెడాయ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదా మీడియాతో మాట్లాడాడు.
'సచిన్ తెందూల్కర్ చాలా తెలివైనవాడు. సెహ్వాగ్ వెర్రిగా ఆడేవాడు. అందుకే మాస్టర్ బ్లాస్టర్ ఇష్టం. అంతే కాదు అతడు నా ఆటను మరింత ఉన్నతంగా మార్చాడు' అని గంగూలీ అన్నాడు. గాయాలు తగిలినప్పుడు సచిన్ ఎంతో ప్రశాంతంగా ఉండేవాడని పేర్కొన్నాడు. 'అతడెంతో ప్రత్యేకం. నేను అతడిని దగ్గర్నుంచి చూశాను. ఒకసారి అతడి పక్కటెములకు బంతి తగలడం గమనించాను. శబ్దం వినిపించడంతో అతడి వద్దకెళ్లి ఫర్వాలేదా అని ప్రశ్నించా. బాగానే ఉన్నా అన్నాడు. తెల్లారి చూస్తే ఎముకలు విరిగాయి' అని వెల్లడించాడు.
బ్యాటింగ్ చేసేటప్పుడు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఎంతో ఇబ్బంది పెట్టేవాడని గంగూలీ తెలిపాడు. అతడి వయసు పెరిగే కొద్దీ మరింత భీకరంగా మారిపోయాడని పేర్కొన్నాడు. 'అవును, వయసు పెరిగే కొద్దీ ముత్తయ్య మరింత పరిణతి సాధించాడు. అతడిని ఆడటం చాలా చాలా కష్టంగా అనిపించేది' అని పేర్కొన్నాడు. తన నాయకత్వ వ్యూహాల గురించీ దాదా వివరించాడు. అవతలి వారు చెప్పేది వినడం ఎంతో ముఖ్యమన్నాడు. మైవే లేదా హైవే అప్రోచ్ మంచిది కాదన్నాడు.
'నా దారో లేదా రహదారో కాదు. ఆటగాళ్లు తమ అభిప్రాయాలు చెప్పగలిగే వాతావరణం సృష్టించాలి' అని దాదా తెలిపాడు. 2001లో ఆసీస్‌ను ఓడించడం, నాట్‌వెస్ట్ ఫైనల్ గెలవడంతో భారత జట్టును మార్చేశాయన్నాడు. ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు.