Kapil Dev on Team India:  చోకర్స్.... ( ముఖ్యమైన టోర్నీల్లో ఒత్తిడి తట్టుకోలేక ఓడిపోయే టీమ్ లను క్రికెట్ పరిభాషలో ఇలా పిలుస్తారు.) ఈ పదం ఇప్పటికి మనం చాలాసార్లు విన్నాం. ముఖ్యంగా దక్షిణాఫ్రికా జట్టును చోకర్స్ గా పిలుస్తుంటారు. ఎందుకంటే కీలకమైన టోర్నీలో వారి ప్రదర్శన ఎప్పుడూ పేలవమే. పేరుకు పెద్ద జట్టయినా, జట్టునిండా స్టార్లు ఉన్నా ఇప్పటికీ ఒక్క వన్డే ప్రపంచకప్ గెలుచుకోలేదు ఆ జట్టు. అదే కాదు ఐసీసీ టోర్నీలో దేనిలోనూ సౌతాఫ్రికా రాణించిన దాఖలాలు లేవు. అందుకే ఆ జట్టును చోకర్స్ గా వర్ణిస్తుంటారు. అయితే ఇప్పుడు భారత జట్టును అలానే పిలవాలేమో అని టీమిండియా మాజీ ఆటగాడు కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. 


భారత్ కు తొలి ప్రపంచకప్ ను అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. ఆ తర్వాత మళ్లీ రెండు సార్లు మాత్రమే టీమిండియా ప్రపంచకప్ లు అందుకుంది. 2007లో తొలి టీ20, 2011 లో వన్డే ప్రపంచకప్ లు మన ఖాతాలో చేరాయి. అప్పుడు కెప్టెన్ ధోనీ. ఆ తర్వాత దాదాపు 11 సంవత్సరాలు ఏ ఐసీసీ టోర్నీని భారత్ గెలవలేకపోయింది. పోయిన 8 ఏళ్లలో 7 సార్లు నాకౌట్ వరకు వెళ్లినా కప్పును మాత్రం అందుకోలేకపోయింది.  ప్రస్తుతం ప్రపంచకప్ లోనూ ఇంగ్లండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 


దారుణ విమర్శలు వద్దు


ఈ నేపథ్యంలోనే కపిల్ దేవ్ టీమిండియా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పుడు భారత్ ను చోకర్స్ అని పిలవడంలో తప్పు లేదు. అయితే ఈ క్లిష్ట సమయంలో మరీ అంతగా విమర్శించాల్సిన అవసరం లేదు. ఈ జట్టులోని చాలామంది ఆటగాళ్లు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా రాణించారు. అందుకే ఇంగ్లండ్ మీద ఓడినప్పటికీ మరీ దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదు.' అని కపిల్ అన్నారు. 


2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్ ప్రదర్శన



  • 2014 T20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి.

  • 2015 వన్డే ప్రపంచకప్ సెమీస్ లో ఓటమి.

  • 2016 T20 ప్రపంచకప్ సెమీస్ లో ఓటమి.

  • 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఓటమి.

  • 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ లో ఓటమి.

  • 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ఓటమి.

  • 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్ లో ఓటమి.


2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించినప్పటి నుంచి భారత్ ఇప్పటివరకు మళ్లీ ఐసీసీ ట్రోఫీని అందుకోలేకపోయింది. 2023లో వన్డే ప్రపంచకప్, 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ లు ఉన్నాయి. మరి అప్పుడైనా ఐసీసీ ట్రోఫీని భారత్ అందుకుంటుందేమో చూడాలి.