Kohli Emotional Post:  టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతుల్లో భారత్ ఓటమి చవిచూసింది. ఇది అభిమానులనే కాదు జట్టు సభ్యులను తీవ్రంగా బాధించింది. నెలల పాటు వారు పడిన శ్రమకు ప్రతిఫలం లేకుండా చేసిన ఓటమి అది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లందరూ ఈ బాధలోనే ఉన్నారు. ఇంగ్లండ్ పై ఓటమిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా తమ బాధను వెల్లడిస్తున్నారు. 


భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ట్విటర్ లో భావోద్వేగభరిత పోస్టును పెట్టాడు. మరో ఏడాది కప్పు లేకుండానే స్వదేశానికి పయనమవుతున్న వేళ ఆ ట్వీట్ లో తన బాధను వ్యక్తంచేశాడు. 'ప్రపంచకప్ గెలవాలన్న మా కలను నెరవేర్చుకోకుండానే భారమైన హృదయాలతో ఆస్ట్రేలియాను వీడి వెళ్తున్నాం. మేమంతా చాలా నిరాశలో ఉన్నాం. అయితే జట్టుగా మేం ఇక్కడినుంచి చిరస్మరణీయ క్షణాలను తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వడమే మా లక్ష్యంగా పెట్టుకుంటాం. మైదానాల్లో మాకు మద్దతిచ్చిన ప్రతి అభిమానికి కృతజ్ఞతలు. భారత జట్టు జెర్సీని ధరించి ఆడడం ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది.' అని రాసుకొచ్చాడు. 


భారత సంచలన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉద్వేగభరిత పోస్ట్ చేశాడు. ఇది చాలా బాధాకరమైన ఓటమి అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాము ఎక్కడ ఆడినా మద్దతిచ్చే అభిమానులకు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలిపాడు. సహాయసిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశాడు. బలంగా తిరిగొస్తామంటూ పేర్కొన్నాడు.