Hardik Pandya Reaction: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతుల్లో భారత్ ఓటమి చవిచూసింది. ఇది అభిమానులనే కాదు జట్టు సభ్యులను తీవ్రంగా బాధించింది. నెలల పాటు వారు పడిన శ్రమకు ప్రతిఫలం లేకుండా చేసిన ఓటమి అది. సూపర్ 12 దశలో పోటీలో ఉన్న అన్ని జట్ల కంటే ఎక్కువ విజయాలు సాధించి.. అందరికన్నా ఎక్కువ పాయింట్లతో సెమీస్ చేరి.. టైటిల్ వేటలో ఫేవరెట్ అనుకున్న టీమిండియా సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఓటమి అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలానే జట్టు మొత్తం నిరాశలో కూరుకుపోయింది.


 టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన బాధను ఇన్ స్టా లో పంచుకున్నాడు. ఈ ఓటమి చాలా బాధను మిగల్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తాము మళ్లీ తిరిగి బలంగా వస్తామని అన్నాడు. 


మేం మళ్లీ వస్తాం


'ఇది చాలా బాధాకరమైనది. మనసును గాయపరిచేది. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. అయితే నాకు, నా సహచరులకు మధ్య ఏర్పడిన బంధాన్ని నేను చాలా ఆస్వాదించాను. మేమందరం ఒకరికొకరం అడుగడుగునా పోరాడాము. నెలల తరబడి అంతులేని అంకితభావం, కృషితో మాకు తోడ్పడిన సహాయ సిబ్బందికి ధన్యవాదాలు. మేము వెళ్లి ఆడిన ప్రతి చోటా మాకు మద్దతునిచ్చిన అభిమానులకు మేము ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉంటాము. ఈ ఓటమి ఊహించనిది. అయినప్పటికీ మేము మా పోరాటాన్ని ఆపము. మళ్లీ తిరిగి బలంగా వస్తాము.' ఇదీ ఇంగ్లండ్ తో ఓటమి అనంతరం భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన ఇన్ స్టా పెట్టిన పోస్ట్ సారాంశం.


10 వికెట్ల తేడాతో ఓడిన భారత్


సెమీఫైనల్ 2 లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనిర్లిద్దరే ఛేదించేశారు. మన బౌలర్లు పూర్తిగా తేలిపోయిన వేళ బట్లర్, హేల్స్ చెలరేగి ఆడారు. కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టీమిండియాకు తీరని వేదన మిగిల్చారు. 


అది మాట్లాడేందుకు ఇది వేదిక కాదు


'సెమీస్‌లో మా ప్రదర్శన నిరాశపరిచింది. ఫైనల్‌కు వెళ్లాలని అనుకున్నా. ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో మెరుగైన జట్టుగా నిలిచింది.మొత్తంమ్మీద, మేం చాలా మంచి క్రికెట్ ఆడాం. ఆటగాళ్లు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మేం కొన్ని విషయాల్లో మెరుగుపడ్డాం. తదుపరి ప్రపంచ కప్ కోసం ఇవి ఉపయోగపడతాయి. మేం టోర్నమెంట్‌లో బాగా బ్యాటింగ్ చేశాం. ఆట ప్రారంభమైనప్పుడు, వికెట్ నెమ్మదిగా ఉందని జట్టు సభ్యులు చెప్పారు. చివరి ఓవర్లు బాగా సాగాయి. మేము 180 నుంచి 185 పరుగులు సాధించగలిగి ఉండాల్సింది.' అని భారత మాజీ కెప్టెన్ చెప్పాడు. సీనియర్ ఆటగాళ్ల భవితవ్యం గురించి మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదని ద్రవిడ్ అన్నారు.