PAK vs ENG Weather Update: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ సవ్యంగా జరిగే అవకాశం కనిపించడం లేదు. రెండు రోజులుగా మెల్‌బోర్న్ నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. శనివారం ఉదయం నుంచి అక్కడ వాన పడుతూనే ఉంది. ఆదివారం 95 శాతం వరకు వర్ష సూచన ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. రిజర్వు డే రోజైన సోమవారమూ వరుణుడు రంగ ప్రవేశం చేస్తాడని సమాచారం.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది. లానినా ప్రభావం వల్ల ఈ పోరు అంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. శనివారం నుంచి గురువారం వరకు అక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, వెబ్‌సైట్లు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచులు వరుణుడి ఖాతాలో చేరిన సంగతి తెలిసిందే.
'ఆకాశం మేఘావృతమైంది. వర్షం కురిసే అవకాశాలు (100%) ఎక్కువగా ఉన్నాయి. భీకరమైర ఉరుములు, మెరుపులతో వాన పడనుంది. తూర్పు నుంచి ఈశాన్యం వైపు 15-25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తరం నుంచి ఆగ్నేయం వైపు 25-35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సాయంత్రం 15 నుంచి 20 కిలోమీటర్లకు తగ్గుతాయి' అని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వెల్లడించింది.
ఒకవేళ ఆదివారం మ్యాచ్ జరగకపోతే రిజర్వు డే అయిన సోమవారం నిర్వహిస్తారు. ముందు జాగ్రత్తగా సమయాన్ని రెండు గంటలు ముందుకు జరిపారు. అంటే స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటలకు ఆట మొదలవుతుంది. దురదృష్టం ఏంటంటే సోమవారమూ జల్లులు పడేందుకు 95 శాతం ఆస్కారం ఉంది. 5 నుంచి 10 మి.మీ. వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు.
వరుసగా రెండు రోజులు వర్షం వచ్చినా పోరుకు మరో వేదికకు మార్చేందుకు నిర్వాహకులు సిద్ధంగా లేరు. నాకౌట్ దశలో ఫలితం నిర్ణయించేందుకు ఛేదనలో కనీసం 5 ఓవర్లు పూర్తవ్వాలి. ఫైనల్లో మాత్రం 10 ఓవర్లు అవసరం. షెడ్యూలు చేసిన రోజు కనీస ఓవర్లు సాధ్యమవ్వకుంటేనే మ్యాచ్‌ను రిజర్వు డేకు మారుస్తారు. ఒకవేళ రెండు రోజులూ వర్షం వచ్చి మ్యాచ్ జరగకపోతే ట్రోఫీని రెండు జట్లకు ఇచ్చేస్తారు.