Sachin Statue:  భారత లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు మరో గౌరవం దక్కనుంది. ముంబయిలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. టెండూల్కర్ ఈ మైదానంలో తన కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడాడు. ఈ విగ్రహాన్ని సచిన్ 50వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 23న కానీ.. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్ సమయంలో కానీ విగ్రహావిష్కరణ ఉంటుందని స్టేడియం అధికారులు తెలిపారు. |


'సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ కోసం ఏం చేశాడో అందరికీ తెలుసు. అతను భారతరత్న. ఈ ఏప్రిల్ తో సచిన్ 50వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. కాబట్టి ఎంసీఏ (ముంబయి క్రికెట్ అసోసియేషన్) నుంచి ఒక చిన్న బహుమతి అతనికి ఇవ్వబోతున్నాం. దీని గురించి సచిన్ తో చర్చించాం. అతని అనుమతి లభించింది. అని ఇది వాంఖడే స్టేడియంలో పెట్టే మొదటి విగ్రహం అవుతుంది, దానిని ఎక్కడ ఉంచాలో మేము నిర్ణయిస్తాం' అని ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపాడు. 










 


సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో 200 టెస్ట్ మ్యాచ్ లు, 463 వన్డేలు ఆడాడు. ఒక టీ20 మ్యాచ్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.  తన అంతర్జాతీయ కెరీర్ లో 34,357 పరుగులు చేశాడు. పరుగుల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. కనీసం అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అలాగే క్రికెట్ లో వంద సెంచరీలు కొట్టాడు. సచిన్ పేరుతో ఇప్పటికే వాంఖడే స్టేడియంలో స్టాండ్ ఉంది. 


వాంఖడే మైదానంలో తన విగ్రహాన్ని పెట్టడంపై సచిన్ స్పందించారు. 'ఆశ్చర్యకర బహుమతి ఇది. నా కెరీర్ ఇక్కడే ప్రారంభమైంది. ఇది నమ్మశక్యం కాని జ్ఞాపకాలతో కూడిన ప్రయాణం. ఈ స్టేడియంలోనే నా కెరీర్ లోనే అత్యుత్తమ క్షణమైన 2011 వన్డే ప్రపంచకప ను గెలుచుకున్నాం.' అని సచిన్ అన్నారు.