ENG vs NZ Test 2023:  వావ్... అసలు ఏం మ్యాచ్ ఇది! 3, 4 రోజుల్లోనే చాలావరకు టెస్టు మ్యాచులు ముగిసిపోతున్న ఈరోజుల్లో మ్యాచ్ ఐదో రోజుదాకా వెళ్లడమే గొప్ప. అలాంటిది ఆ ఐదో రోజు థ్రిల్లర్ మూవీని తలపించేలా మలుపులు, ట్విస్టులు ఉంటూ.. విజయం దోబూచులాడుతూ.. ఏ జట్టు గెలుస్తుందా అని చివరివరకు అనిపించే టెస్ట్ మ్యాచ్ చూడడం అద్భుతంగా ఉంటుంది. అలాంటి మ్యాచ్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య జరిగింది. భారత్ లో ఇంకా తెల్లవారకముందే.. ప్రపంచ క్రికెట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అనదగ్గ టెస్ట్ మ్యాచ్ ఒకటి ముగిసిపోయింది. చూసినవాళ్లు జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా.. చూడనివాళ్లు అయ్యో ఎందుకు మిస్సయ్యామా అనే విధంగా సాగిన ఉత్కంఠభరిత ఈ టెస్టులో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 


వారెవ్వా.. న్యూజిలాండ్ జట్టు అద్భుతమే చేసింది. టీ20, వన్డేలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో  విజయం సాధించింది. వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కు భారీగా ఆధిక్యం సమర్పించుకుని, ఫాలో ఆన్ ఆడి మరీ కివీస్ జట్టు సాధించిన ఈ విజయం చరిత్రలో ఒకటిగా నిలిచిపోతుంది. 


తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం


ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 8 వికెట్లకు 435 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. హారీ బ్రూక్ (186), జో రూట్ (153 నాటౌట్) భారీ సెంచరీలు బాదారు. బదులుగా కివీస్ 209 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్లందరూ విఫలమైన వేళ కెప్టెన్ టిమ్ సౌథీ (49 బంతుల్లో 73) ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్లండెల్ (38), లాథమ్ (35) పర్వాలేదనిపించారు. దీంతో ఇంగ్లండ్ కు 226 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో లానే రెండో ఇన్నింగ్స్ లోనూ న్యూజిలాండ్ ను కుప్పకూల్చి ఇన్నింగ్స్ విజయం సాధించాలని ఇంగ్లండ్ భావించిందేమో. అందుకే మళ్లీ బ్యాటింగ్ కు రాకుండా కివీస్ ను ఫాలో ఆన్ ఆడించింది. అయితే ఆ నిర్ణయం ఎంత తప్పో ఆ సమయంలో ఇంగ్లిష్ జట్టుకు తెలియలేదు. 


మొదటి ఇన్నింగ్స్ లో కెప్టెన్ సౌథీ బ్యాటింగ్ చేసిన తీరుతో స్ఫూర్తి పొందిన కివీస్ బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (132) శతకం చేయగా.. టామ్ లాథమ్ (83), డెవాన్ కాన్వే (61), టామ్ బ్లండెల్ (90), డారిల్ మిచెల్ (54) ఇలా బ్యాటర్లందరూ సమష్టిగా సత్తా చాటడంతో 483 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లోటు తీసేయగా ఇంగ్లండ్ ముందు 258 పరుగుల లక్ష్యం నిలిచింది. 


విజయం దోబూచులాట


రెండో ఇన్నింగ్స్ లో ఒక దశలో ఇంగ్లండ్ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో న్యూజిలాండ్ విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే జోరూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ అంత తేలికగా వదల్లేదు. రూట్ వన్డేలను తలపించేలా 113 బంతుల్లోనే 95 పరుగులు చేశాడు. మరోవైపు స్టోక్స్ 116 బంతుల్లో 33 క్రీజులో పాతుకుపోయాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 121 పరుగులు జోడించారు. వీరి జోరుతో ఇంగ్లండ్ గెలిచేస్తుందేమో అనిపించింది. ఆ సమయంలోనే కివీస్ బౌలర్ నీల్ వాగ్నర్ హీరోగా మారాడు. రూట్, స్టోక్స్ ఇద్దరినీ ఔట్ చేశాడు. వారి వెనుదిరిగాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. 


ఆఖర్లో ఉత్కంఠ


జో రూట్ ఔటయ్యాక మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. స్టోక్స్ ఓవైపు తన వికెట్ కాపాడుకుంటూనే ఫోక్స్ (35), బ్రాడ్ (11)లతో కలిసి జట్టును విజయం వైపుగా నడిపించాడు. వారిద్దరూ ఔటయ్యాక 11వ బ్యాటర్ గా జేమ్స్ అండర్సన్ క్రీజులోకి వచ్చాడు. విజయానికి 6 పరుగులు అవసరమైన దశలో అండర్సన్ ఫోర్ కొట్టాడు. అంతే అటు కివీస్, ఇటు ఇంగ్లండ్ శిబిరాల్లో టెన్షన్, టెన్షన్. గెలుపునకు ఇంకో 2 పరుగులు మాత్రమే కావాలి. ఈ దశలో మళ్లీ నీల్ వాగ్నర్ అద్భుతమే చేశాడు. వాగ్నర్ లెగ్ సైడ్ వేసిన బంతిని గ్లాన్స్ చేయబోయిన అండర్సన్ కీపర్ కు క్యాచ్ ఇచ్చేశాడు. అంతే విజయానికి 2 పరుగుల దూరంలో ఇంగ్లండ్ ఆలౌట్. ఒకే ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం. ఈ విజయంలో రెండు మ్యాచ్ లసిరీస్ 1-1తో సమమైంది. 


మొత్తం మీద టెస్ట్ క్రికెట్ చరిత్రలో.... ఫాలో ఆన్ ఆడి మ్యాచ్ గెలుచుకున్న సందర్భం ఇది కేవలం నాలుగోదే. సుమారు 22 ఏళ్ల క్రితం... టీమిండియా ఆస్ట్రేలియా మీద కోల్ కతాలో గెలిచిన మ్యాచ్ గుర్తుందిగా. అది కూడా ఫాలో ఆన్ ఆడిన తర్వాతే. అంతకుముందు 1894లో ఓసారి, 1981లో ఓసారి ఫాలో ఆడి మరీ ఇంగ్లండ్ రెండుసార్లు టెస్టు విజయాలు కైవసం చేసుకుంది.