ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా విధ్వంసం కొనసాగుతోంది. మొదట భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం, తర్వాత ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కూల్చేసి ఘన విజయం సాధించడం ప్రొటీస్‌కు అలవాటుగా మారింది. మరోసారి అదే సాంప్రదాయాన్ని  న్యూజిలాండ్‌పై సఫారీ జట్టు కొనసాగించింది. మొదట బ్యాటింగ్‌తో భారీ స్కోరు సాధించిన  ప్రొటీస్‌... తర్వాత కివీస్‌ను తక్కువ స్కోరుకే కుప్పకూల్చి సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌... దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు ఓపెనర్‌ డికాక్‌, డసెన్‌ సెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అనంతరం 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ కేవలం 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రొటీస్ 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

 

చెలరేగిన డికాక్‌, డసెన్‌

ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.  బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు టెంటా బవుమా, డికాక్‌ పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. 28 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు చేసి ధాటిగా ఆడుతున్న బవుమాను బౌల్ట్‌ అవుట్‌ చేసి కివీస్‌కు తొలి వికెట్‌ అందించాడు. 38 పరుగుల వద్ద బవుమా అవుట్‌ అయ్యాడు. ఈ ఆనందం న్యూజిలాండ్‌కు కొద్దిసేపు కూడా నిలవలేదు. మరో 200 పరుగుల వరకు న్యూజిలాండ్‌కు మరో వికెట్‌ దక్కలేదు.  ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ శతకాలతో చెలరేగారు. క్వింటన్‌ డికాక్‌ (114; 116బంతుల్లో 10x4, 3x6), మరో స్టార్ బ్యాటర్ డసెన్‌ (133; 118 బంతుల్లో 9x4, 5x6) శతకాలతో చెలరేగారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (53; 30 బంతుల్లో 2x4, 4x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో దక్షిణాఫ్రికా ఈ వరల్ కప్‌లో మరోసారి భారీ స్కోరు చేసింది. డికాక్, వాన్ డర్ డసెన్‌ వీలుచిక్కనప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు వేగం పెంచారు. ఈ క్రమంలో 103 బంతుల్లోనే డికాక్ శతకం నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో డికాక్‌కు ఇది నాలుగో సెంచరీ. ఈ ప్రపంచ కప్‌లో 500 పరుగుల మార్క్ దాటిన తొలి బ్యాటర్‌గా కూడా డికాక్ రికార్డు సృష్టించాడు. రెండో వికెట్ కు 200 పరుగుల భారీ భాగస్వామ్యం  నెలకొల్పాక డికాక్‌ను సౌథీ ఔట్ చేశాడు. ఫిలిప్స్ కు క్యాచిచ్చి డికాక్ పెవిలియన్ చేరాడు. జేమ్స్ నీషమ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి 101 బంతుల్లో డసెన్ సెంచరీ సాధించాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో సౌథీ బౌలింగ్ లోనే డసెన్ క్లీన్ బౌల్డయ్యాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (53) వేగంగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. క్లాసెన్(15 నాటౌట్), మార్ క్రమ్(6) నాటౌట్ గా నిలిచారు. కివీస్ బౌలర్లలో టిమ్‌ సౌథీ 2 వికెట్లు పడగొట్టాడు. జేమ్స్‌ నీషమ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ చెరో వికెట్‌ తీశారు. 

 

కుప్పకూలిన కివీస్‌

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను దక్షిణాఫ్రికా బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. మార్కో జాన్సన్‌ పేస్‌తో, కేశవ్‌ మహరాజ్‌ స్పిన్‌తో కివీస్‌ను చుట్టేశారు. 8 పరుగుల వద్ద కాన్వేను అవుట్‌ చేసిన జాన్సన్ కివీస్‌ పతనానికి శ్రీకారం చుట్టాడు. 45 పరుగుల వద్ద ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రచిన్‌ రవీంద్రను కూడా అవుట్‌ చేసిన జాన్సన్‌ కివీస్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అక్కడి నుంచి కివీస్ వికెట్ల పతనం ఆగలేదు. వరుసగా వికెట్ల పతనం కొనసాగింది. విల్‌ యంగ్‌ 33 పరుగులు, డేరిల్‌ మిచెల్‌ 24, గ్లెన్‌ ఫిలిప్స్‌ 60 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫిలిప్స్‌ ఒక్కడే అర్ధ శతకం సాధించాడు. మిగిలిన కివీస్‌ బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఏడుగురు కివీస్‌ బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేదంటే కివీస్‌ వికెట్ల పతనం ఎలా సాగిందో తెలుసుకోవచ్చు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సన్‌ 3, కేశవ్‌ మహరాజ్‌ 4 వికెట్లు, కోట్జే రెండువికెట్లు తీశారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో కివీస్‌ కేవలం 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రొటీస్ 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  ఈ విజయంతో దక్షిణాఫ్రికా సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టింది.