ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మహా సంగ్రామంలో ఆడిన ఆరు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోహిత్‌ సేన.. శ్రీలంకను ఢీ కొట్టబోతుంది. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడిన తర్వాత తొలిసారి భారత్‌-శ్రీలంక తలపడబోతున్నాయి. కానీ 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక-భారత్‌ సమఉజ్జీలుగా ఉండగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో ఊపు మీదుండగా.. శ్రీలంకను వరుస పరాజయాలు వీడడం లేదు. రోహిత్‌ సేన ఆడిన ఆరు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. లంకేయులు మాత్రం ఆడిన ఆరు మ్యాచుల్లో రెండే విజయాలు, నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకు అసలు శ్రీలంక కనీస పోటీ ఇవ్వగలుగుతుందో లేదో చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచి అధికారికంగా.. ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా సెమీస్‌ చేరాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. 

 

ఆత్మవిశ్వాసంతో భారత్‌

ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. చెన్నైలో ఆస్ట్రేలియాపై 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశ నుంచి విజయం సాధించడం.. లక్నోలో ఇంగ్లండ్‌ను 229 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించకుండా చేసి గెలుపొందడం రోహిత్‌ సేన ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ సేనతో తలపడాలంటే ప్రత్యర్థి జట్లు తమ ప్రదర్శనను గణనీయంగా పెంచుకోవాల్సి వస్తోంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా గైర్హాజరీ వల్ల జట్టు సమతుల్యత దెబ్బతింది. దీనిని రోహిత్‌ శర్మ ఎలా అధిగమిస్తాడో చూడాలి. తొలి నాలుగు మ్యాచ్‌లు తుది జట్టులో స్థానం దక్కని షమీ తర్వాతి రెండు మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. అయితే బుమ్రా, షమీలను నాకౌట్‌ మ్యాచ్‌ల కోసం తాజాగా ఉంచేందుకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది. 

భారత జట్టును శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్  ఫామే ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్‌లో ఇంతవరకూ వీరిద్దరూ భారీ స్కోర్లు నమోదు చేయలేదు. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచులకు దూరమైన గిల్... తర్వాత జట్టులోకి వచ్చి ఒక అర్ధ శతకం మాత్రమే సాధించాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన గిల్‌.. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేయాలని భావిస్తున్నాడు. షార్ట్ బాల్‌ బలహీనతను అధిగమించి శ్రీలంకపై భారీ స్కోరు సాధించాలని అయ్యర్‌ కుడా పట్టుదలగా ఉన్నాడు. రోహిత్ కూడా మరోసారి భారీ స్కోరుపై కన్నేశాడు. ప్రపంచ కప్‌లో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 66.33 సగటుతో 398 పరుగులు చేసిన రోహిత్‌ ఈ మ్యాచ్‌లో రెచ్చిపోతే లంకకు కష్టాలు తప్పువు. 

 

లంక పరిస్థితి పూర్తి భిన్నం

శ్రీలంక పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గాయాలు, కీలక ఆటగాళ్ళు దూరంగా కావడం వంటి సమస్యలతో లంక సతమతమవుతోంది. సదీర సమరవిక్రమ ఆరు మ్యాచుల్లో  ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 331 పరుగులు చేసి లంక బ్యాటర్లలో అత్యధిక పరుగులు చేశాడు. పాతుమ్ నిస్సంక కూడా గిల్ తర్వాత ఈ ఏడాది వెయ్యికి పైగా వన్డే పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ప్రపంచ కప్‌లో నిస్సంకకు నాలుగు వరుస అర్ధసెంచరీలు ఉన్నాయి. కుశాల్ మెండిస్ కూడా లంక జట్టులో చూడదగిన ఆటగాడే. ఏంజెలో మాథ్యూస్ తిరిగి జట్టులోకి రావడంతో  అతడిపై లంక ఆశలు పెట్టుకుంది.
  

 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

 

శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), కుసల్ పెరెరా, పాతుమ్ నిస్సంక, లహిరు కుమార, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, కసున్ రజిత, ఏంజెలో మాథ్యూస్, దిల్‌షాన్ మాథ్యూస్, దిల్కషన్ మథ్యూస్ కరుణరత్నే.