భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటిదాకా టోర్నీలో కొన్ని సంచలన విజయాలూ నమోదయ్యాయి. అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్ సంచలనాలు నమోదు చేశాయి. ఇంగ్లండ్, పాక్ పేలవ ప్రదర్శనలతో విమర్శలు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు అభిమానులు, జట్ల దృష్టంతా నాకౌట్ చేరే జట్లేవి అన్న దానిపై ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ 31 మ్యాచ్‌లు జరగగా బంగ్లాదేశ్ ఒక్కటే అధికారికంగా నాకౌట్ నుంచి నిష్క్రమించింది. మిగిలిన 9 జట్లకు సాంకేతికంగా అవకాశాలు ఉన్నాయి.
ఈ తొమ్మిది జట్లలో ఏ జట్టుకు నాకౌట్ చేరే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయంటే....
టీమిండియా: ఈ ప్రపంచకప్‌లో భారత్ జట్టు మొత్తం 6 మ్యాచ్‌లు సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం చేసుకుంది. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే రోహిత్ సేన సెమీస్ చేరుకుంటుంది. అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయినా టీమిండియాకు అవకాశాలు ఉంటాయి. టీమిండియా సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు 99%.
దక్షిణాఫ్రికా: ఈ ప్రపంచకప్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు సెమీఫైనల్‌కు చేరే అవకాశం 98% ఉంది. ప్రొటీస్ జట్టు 6 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచింది. నెట్ రన్ రేట్ అద్భుతంగా ఉంది. మిగిలిన మూడు మ్యాచుల్లో కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా ప్రొటీస్ సెమీస్ చేరుకుంది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడినా సెమీస్ ఆశలు ఉంటాయి.
ఆస్ట్రేలియా: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కంగారూ జట్టు వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌కు చేరువైంది. ఆస్ట్రేలియా తదుపరి మూడు మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లు గెలిస్తే సెమీఫైనల్ చేరుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచినా మాత్రమే గెలిచినా కంగారులకు అవకాశాలు ఉంటాయి. కంగారూ జట్టు సెమీ ఫైనల్ అవకాశాలు 85%.
న్యూజిలాండ్: గత రెండు మ్యాచ్‌ల్లో కివీస్ జట్టు ఓడిపోయింది. దీంతో సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు కాస్త తగ్గినా న్యూజిండ్ సెమీస్ చేరే అవకాశాలు 84 శాతం ఉన్నాయి. కానీ కివీస్ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలవాలి. ఒకటి గెలిచినా నెట్ రన్ రేట్ పై నాకౌట్ ఆశలు ఆధారపడి ఉంటాయి.
ఆఫ్ఘానిస్థాన్: ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలను ఓడించి సెమీఫైనల్‌కు చేరేందుకు అఫ్గాన్ పోటీదారుగా మారింది. ఆఫ్ఘన్ జట్టు 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిస్తే, నెట్ రన్ రేట్ ఆధారంగా అఫ్గాన్ సెమీస్ చేరుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే కచ్చితంగా సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. ఆఫ్ఘన్ జట్టు సెమీస్ చేరే అవకాశాలు 15 శాతం.
పాకిస్థాన్: పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌కు కూడా సెమీస్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలంటే పాక్ చివరి రెండు మ్యాచ్‌లను గెలిచి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశం 10 శాతం మాత్రమే
శ్రీలంక: ఆరు మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిన శ్రీలంక జట్టుకు సెమీఫైనల్ ఆడే అవకాశాలు కేవలం 5 శాతం మాత్రమే. శ్రీలంక నాకౌట్‌కు చేరాలంటే చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. అంటే న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్‌లను ఓడించాలి. దీంతో పాటు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.
నెదర్లాండ్స్: దక్షిణాఫ్రికా, శ్రీలంకలను ఓడించిన నెదర్లాండ్స్‌కు కూడా సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. డచ్ జట్టు ఆశలు సాకారం కావాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, మిగిలిన జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాలి. నెదర్లాండ్స్ సెమీస్ ఆశలు కేవలం 3%.
ఇంగ్లండ్: ప్రపంచకప్ 2023లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయం సాధించాలి. దీంతో పాటు ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు 1% మాత్రమే.