ప్రపంచకప్‌లో వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై కొద్దిగా పచ్చిక కనిపిస్తుండడంతో సీమర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే టాస్ గెలవగానే కివీస్ సారధి టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ పిచ్‌పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకుని ప్రొటీస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అనుకున్నట్లే ఈ మ్యాచ్‌కు కూడా రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఫెర్గ్యూసన్ స్థానంలో సౌథీ జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాలో రబాడ తిరిగి తుది జట్టులోకి రాగా షంసీపై వేటు పడింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇదే గ్రౌండ్‌లో గత మ్యాచ్‌లో శ్రీలంకపై అఫ్గాన్ ఘన విజయం సాధించింది. ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. కానీ పిచ్‌పై ఉన్న తేమ ఆరంభంలో సీమర్లకు ఉపయోగపడే అవకాశం ఉంది.
వరల్డ్‌కప్ ఆరంభంలో వరుస విజయాలు సాధించి తర్వాత రెండు ఓటములు చవిచూసిన న్యూజిలాండ్... పాకిస్థాన్‌పై చివరి వికెట్‌కు అద్భుత విజయం సాధించిన దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. సెమీఫైనల్ బెర్త్‌ల కోసం రెండు జట్లూ గట్టి పోటీలో ఉన్నందున ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకం కానుంది. దక్షిణాఫ్రికా ఆరు మ్యాచుల్లో అయిదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ ఆరు మ్యాచుల్లో 4 విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ సెమీస్ బెర్తులను ప్రభావితం చేయనుండడంతో ఇరు జట్లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి. దక్షిణాఫ్రికా జట్టులో క్వింటన్ డి కాక్ 431 పరుగులతో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు మూడు సెంచరీలతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రొటీస్‌కు డికాక్ ఉంటే న్యూజిలాండ్‌కు రచిన్ రవీంద్ర ఉన్నాడు. న్యూజిలాండ్ తదుపరి బ్యాటింగ్ సంచలనంగా అభివర్ణిస్తున్న రచిన్ ఈ ప్రపంచకప్‌లో 406 పరుగులతో మెరుగ్గా రాణిస్తున్నాడు. సౌతాఫ్రికా తరఫున క్లాసెన్ 300 పరుగులతో ఫినిషర్ పాత్ర పోషిస్తుండగా... న్యూజిలాండ్‌లో ఆ పనిని జిమ్మీ నీషమ్ నిర్వర్తిస్తున్నాడు. డేవిడ్ మిల్లర్, డారిల్ మిచెల్, ఐడెన్ మార్క్రామ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్లతో ఇరు జట్లు బ్యాటింగ్‌లో బలోపేతంగా ఉన్నాయి.
బౌలింగ్‌లోనూ కివీస్-సఫారీ జట్లు దుర్భేద్యంగా ఉన్నాయి. కగిసో రబడా తిరిగి జట్టులోకి రానున్నాడు. గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్‌లతో దక్షిణాఫ్రికా బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షంసీ స్పిన్‌తో పర్వాలేదనిపిస్తున్నారు. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో షంసీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకుని సత్తా చాటాడు. న్యూజిలాండ్‌లో మిచెల్ శాంట్నర్ స్పిన్‌తో ప్రొటీస్ బ్యాటర్లకు పరీక్ష పెట్టగలడు.
దక్షిణాఫ్రికా ఫైనల్ 11: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, ఎంగిడి, కగిసో రబడ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.
న్యూజిలాండ్ ఫైనల్ 11: ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ , విల్ యంగ్.