South Africa vs New Zealand Highlights: 
పుణె: వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. తమకే సాధ్యమన్నట్లుగా మరోసారి 350 మార్క్ రన్స్ చేశారు సఫారీలు. ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ (114; 116బంతుల్లో 10x4, 3x6), మరో స్టార్ బ్యాటర్ డసెన్‌ (133; 118 బంతుల్లో 9x4, 5x6) శతకాలతో చెలరేగారు. కెప్టెన్ బవుమా (24) మరోసారి నిరాశపరిచాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (53; 30 బంతుల్లో 2x4, 4x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో దక్షిణాఫ్రికా జట్టు ఈ వరల్ కప్ లో మరోసారి భారీ స్కోరు చేసింది. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసి న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ నిలిపారు సఫారీలు. కివీస్ బౌలర్లలో టిమ్‌ సౌథీ 2 వికెట్లు పడగొట్టాడు. జేమ్స్‌ నీషమ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ చెరో వికెట్‌ తీశారు.


అంతకుముందు టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఆరంభంలో చాలా నెమ్మదిగా ఆడారు. ట్రెంట్ బౌల్ట్ మొదటి మూడు ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో బ్యాట్ ఝులిపిస్తూ డికాక్, బవుమా పరుగులు రాబట్టారు. టీమ్ స్కోరు 38 పరుగుల వద్ద బౌల్ట్ బౌలింగ్ లో సఫారీ కెప్టెన్ బవుమా ఔటయ్యాడు. మిచెల్ క్యాచ్ పట్టడంతో తొలి వికెట్ గా నిష్ర్కమించాడు. ఆ తరువాత డికాక్ కు వన్డ డౌన్ బ్యాటర్ వాన్ డర్ డసెన్ తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. వీలుచిక్కనప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు వేగం పెంచారు. ఈ క్రమంలో 103 బంతుల్లోనే డికాక్ శతకం నమోదు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో సఫారీ ఓపెనర్ కు ఇది నాల్గవ సెంచరీ. ఈ వరల్డ్ కప్ లో 500 పరుగుల మార్క్ దాటిన తొలి బ్యాటర్ గా డికాక్ నిలిచాడు.






రెండో వికెట్ కు 200 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాక డికాక్ ను సౌథీ ఔట్ చేశాడు. ఫిలిప్స్ కు క్యాచిచ్చి డికాక్ పెవిలియన్ చేరాడు. జేమ్స్ నీషమ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి 101 బంతుల్లో డసెన్ సెంచరీ సాధించాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో సౌథీ బౌలింగ్ లోనే డసెన్ క్లీన్ బౌల్డయ్యాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (53) వేగంగా ఆడి హాఫ్ సెంచరీ చేసి వికెట్ సమర్పించుకున్నాడు. క్లాసెన్(15 నాటౌట్), మార్ క్రమ్(6) నాటౌట్ గా నిలిచారు. రెండు పటిష్ట జట్ల మధ్య పోరు కావడంతో మ్యాచ్ పై క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఉన్నారు. సఫారీలు గెలిస్తే టేబుల్ టాపర్ అవుతారు.