SA vs BAN Highlights, T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup 2024)లో లో స్కోరింగ్ మ్యాచులు.... హై టెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఆతిథ్య అమెరికా-వెస్టిండీస్‌లోని పిచ్‌లు పూర్తిగా బౌలింగ్‌కే అనుకూలిస్తుండడంతో స్వల్ప స్కోరు నమోదవుతున్నా.. మ్యాచులు మాత్రం ఉత్కంఠభరితంగానే సాగుతున్నాయి. భారత్‌-పాకిస్థాన్‌(Ind Vs Pak) మ్యాచ్‌ క్రికెట్‌ ప్రపంచానికి హై టెన్షన్‌ మ్యాచ్‌ను అందించగా... తాజాగా దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్(SA vs BAN) మ్యాచ్‌ కూడా అలాగే సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా కేవలం 113 పరుగులే చేయగా బంగ్లాదేశ్‌ 109 పరుగులకే పరిమితమైంది. చివరి బంతివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు మరోసారి మంచి మ్యాచ్‌ను అందించింది. 


 

వికెట్ల జాతర

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా(South Africa) తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌలర్లు చెలరేగిపోవడంతో సౌతాఫ్రికా బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టమైపోయింది. ఆరు వికెట్లే కోల్పోయినా దక్షిణాఫ్రికా కేవలం 113 పరుగులే చేయగలిగింది. తొలి ఓవర్‌లో చివరి బంతికే సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. 11 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మొదటి వికెట్‌ పడింది. ఎదుర్కొన్న తొలి బంతికే హెండ్రిక్స్‌ను హసన్‌ షకీబ్‌ అవుట్‌ చేశాడు. కాసేపటికే 19 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. 11 బంతుల్లో 18 పరుగులు చేసి ధాటిగా ఆడుతున్న క్వింటన్‌ డికాక్‌ను కూడా హసన్‌ షకీబ్‌ అవుట్‌ చేసి ప్రొటీస్‌కు షాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగు పరుగులకే దక్షిణాఫ్రికా మరో నాలుగు పరుగులు చేయగానే  ఇంకో వికెట్‌ నేలకూలింది. ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు చేసిన మార్‌క్రమ్‌ను తస్కిన్‌ అహ్మద్‌ అవుట్‌ చేశాడు. టిస్టన్‌ స్టబ్స్‌ను కూడా తస్కిన్‌ అహ్మద్‌ అవుట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 23 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం హెన్రిచ్‌ క్లాసెన్‌-డేవిడ్‌ మిల్లర్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బంగ్లా బౌలర్లు నిప్పులు చెరుగుతుండడంతో క్లాసెన్‌- మిల్లర్‌ సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును వంద పరుగులు దాటించేలా చేశారు. క్లాసెన్‌ 44 బంతుల్లో 46 పరుగులు చేసి... తస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అవ్వగా.... 38 బంతుల్లో 29 పరుగులు చేసిన మిల్లర్‌ను హొసైన్‌ బౌల్డ్‌ చేశాడు. వీరిద్దరి పోరాటంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

 

బంగ్లా పోరాడినా

బంగ్లా( Bangladesh) ముందు కేవలం 114 పరుగుల లక్ష్యమే ఉండడంతో ఛేదించేలా కనిపించింది. కానీ ఆ స్వల్ప లక్ష్యం కూడా బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చాలా పెద్దదిగానే కనిపించింది. దక్షిణాఫ్రికా పేసర్లు-స్పిన్నర్లు బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. 50 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లా లక్ష్యం దిశగా సాగుతున్నట్లే కనిపించింది.  హిద్రోయ్‌-మహ్మదుల్లా పోరాడడంతో బంగ్లా విజయం ఖాయమని అంతా భావించారు. కానీ వీరిద్దరూ అవుటయ్యాక సౌతాఫ్రికా బౌలర్లు బంగ్లాపై ఒత్తిడి పెంచారు. చివరి 18 బంతుల్లో 20 పరుగులే చేయాల్సి రావడం... చేతిలో వికెట్లు ఉండడంతో బంగ్లా విజయం ఖాయంగానే కనిపించింది. కానీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన రబాడ, బార్ట్‌మన్, మహరాజ్‌ బంగ్లా బ్యాటర్లను తిప్పలు పెట్టారు. హృదోయ్‌ని రబాడ ఔట్‌ చేయడంతో ఈ మ్యాచ్‌ ఊహించని మలుపు తిరిగింది. బంగ్లా విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా.. స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. తొలి రెండు బంతుల్లో 4 పరుగుే ఇచ్చిన మహజార్‌... మూడో బంతికి అలీని పెవిలియన్‌ చేర్చాడు. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా.. మహ్మదుల్లా.... మార్‌క్రమ్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు అవుటయ్యాడు. లాస్ట్‌ బాల్‌కు సింగిలే రావడంతో ప్రొటీస్‌ విజయభేరీ మోగించింది.