Super 8 qualification scenarios of PAK, ENG, NZ and SL: టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2024) ఫీవర్ పెరుగుతోంది. భారత్-పాకిస్థాన్(Indi Vs Pak) మ్యాచ్‌తో ఈ ఫీవర్ మరింత పెరిగింది. ఇప్పటికే దిగ్గజ జట్లకు షాకులు తగిలాయి. టీ 20 ప్రపంచకప్ ఆరంభమై వారం కూడా గడవక ముందే మూడు అగ్రశ్రేణి జట్లు... ఈ మెగా టోర్నీ సూపర్ 8కు అర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయా.. లేక లీగ్ దశను కూడా దాటకుండా అపఖ్యాతి మూట కట్టుకుంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్(Pakistan)ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ 2 మ్యాచ్‌లు అడి రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలై సున్నా పాయింట్లతో ఉంది. సూపర్-8కి వెళ్లాలంటే పాక్ తన తదుపరి రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాలి. కెనడా, అమెరికా మిగిలిన అన్ని మ్యాచులు ఓడిపోవాలి. అప్పుడే పాకిస్థాన్ సూపర్ 8కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ అలా జరిగినా పాకిస్థాన్-అమెరికా నాలుగు పాయింట్లతో ఉంటాయి. ఆ పరిస్థితుల్లో నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. అంటే మిగిలిన రెండు మ్యాచులను పాక్ భారీ తేడాతో గెలవాలి. ఈ రెండింటిలో ఏ మ్యాచ్ అయినా వర్షం కారణంగా రద్దైతే పాకిస్థాన్ టీ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. బాబర్ అజామ్ కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టు కష్టాలు బాగా పెరిగాయి.
ఇంగ్లండ్ (England)
గ్రూప్-బీలో ఇంగ్లండ్ కూడా దాదాపుగా ఇవే కష్టాలు పడుతోంది. స్కాట్లాండ్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్‌లో జోస్ బట్లర్ సేన 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు ఇంగ్లండ్‌కు 2 మ్యాచ్‌లలో కేవలం ఒకే పాయింట్ ఉంది. ఇంగ్లండ్ నెట్ రన్-రేట్ -1.800 గా ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్ ఒమన్, నమీబియాలపై తదుపరి 2 మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఇది కాకుండా ఆస్ట్రేలియా చేతిలో స్కాట్లాండ్ భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడే ఇంగ్లండ్ సూపర్ 8కు వస్తుంది.
న్యూజిలాండ్( New Zealand)
టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్ సీలో తమ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 84 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయింది. కివీస్ ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కివీస్ నెట్ రన్‌రేట్ -4.200. వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లను గెలిచి గ్రూప్ సీ టేబుల్‌లో టాప్-2లో కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్ సూపర్-8కి వెళ్లాలంటే ఇక మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవాలి. ఆతిథ్య వెస్టిండీస్ తన తదుపరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలని కివీస్ కోరుకోవాలి. అప్పడుు ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ మూడు 4 పాయింట్లతో ఉంటాయి. అదే జరిగితే ఈ మూడు జట్లు సూపర్-8కు అర్హత సాధించాలంటే నెట్ రన్-రేట్ కీలకంగా మారనుంది.
అమెరికా(USA)-అఫ్గాన్AFG) అద్భుతాలు
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ ఏలో అమెరికా అద్భుతాలు చేస్తోంది. ఈ జట్టు 2 విజయాలు నమోదు చేసి 4 పాయింట్లు సాధించింది. తదుపరి 2 మ్యాచ్‌ల్లో ఒకదానిలో గెలిచినా అమెరికా సూపర్ 8కు అర్హత సాధిస్తుంది. గ్రూప్ సీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం సూపర్-8కి వెళ్లడానికి బలమైన పోటీదారుగా కనిపిస్తోంది. అఫ్గానిస్థాన్ మరో రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిస్తే సూపర్-8లో స్థానం దాదాపు ఖాయం.