Mumbai Cricket Association president Amol Kale dies of cardiac arrest: ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమోల్‌ కాలే(Amol Kale) 47 ఏళ్ల వయసులోనే  హఠాన్మరణం చెందారు. అమెరికాలో(USA)ని న్యూయార్క్‌ లో ఉన్న ఆయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ను కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక్షంగా చూసిన అమోల్‌కాలే అనంతరం గుండెపోటుతో కన్నుమూశారు.

 

ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ అజింక్యా నాయక్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సూరజ్ సమత్‌తో సహా ఇతర MCA అధికారులు కూడా చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూశారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన అమోల్‌.. 2022లో ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 47 ఏళ్ల కాలే అక్టోబర్ 2022లో జరిగిన ఎన్నికలలో మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్‌ను ఓడించి MCA అధ్యక్షుడయ్యారు. బీసీసీఐ ఆటగాళ్లకు ఇచ్చే మ్యాచ్ ఫీజులనే ముంబై జట్టు సభ్యులకూ ఇచ్చేందుకు ఇటీవల కాలే ముందుకు వచ్చారు. వాంఖడే స్టేడియంలో క్రికెట్‌ గాడ్ సచిన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. 


 

ఆటగాళ్ల నివాళులు

అమోల్‌కాలే ఆకస్మిక మరణంపై మాజీ క్రికెటర్లు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ కాలే మృతిపై రవిశాస్త్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్రికెట్‌పై కాలేకు ఉన్న అభిరుచి అసామన్యమని రవిశాస్త్రి అన్నాడు. క్రికెట్‌ అభివృద్ధికి కాలే అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. కాలే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు రవిశాస్త్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్‌కాలే మరణం తనను ఆవేదనకు గురిచేసిందని  MCA అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు జితేంద్ర అవద్ తెలిపారు. 

 

కీలక నిర్ణయాలు

ప్రముఖ వ్యాపారవేత్త కాలే 2022 అక్టోబర్‌లో MCA అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 19 నెలల పాటు ఆ పదవిలో ఉన్నారు. నాగ్‌పూర్‌కు చెందిన కాలే దశాబ్దం క్రితమే ముంబైలో స్థిరపడ్డారు. నాగ్‌పూర్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో BE చేసిన కాలే J K సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అర్పితా ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడితో పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా ఉన్నారు. MCA అధ్యక్షుడిగా తన పదవీకాలం ఇంకా రెండేళ్లు పూర్తి చేయకపోయినా కాలే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాలే అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే వాంఖడే స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్‌ టెస్ట్‌తో 2023 ప్రపంచ కప్ మ్యాచ్‌లు. ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించింది.

 

సచిన్ విగ్రహం ఏర్పాటు

అమోల్‌కాలే అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ సమయంలో 'సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ కోసం ఏం చేశాడో అందరికీ తెలుసని.. అందుకే ఈ విగ్రహం ఏర్పాటు చేశామని కాలే తెలిపాడు. వాంఖడే స్టేడియంలో మొదటి విగ్రహం సచిన్‌దే పెట్టి కాలే సచిన్‌కు మరచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చాడు.