Happy Birthday Rohit Sharma: క్రికెట్‌ ప్రపంచంలో అతనో హిట్‌మ్యాన్‌... మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక అటగాడు... సిక్సర్లను సింగిల్స్‌ తీసినంత ఈజీగా కొట్టగల విధ్వంస బ్యాటర్‌.. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌ వరకు తీసుకెళ్లిన సారధి. అతను బరిలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు హడల్‌. బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసి టీమిండియా విజయానికి బాటలు వేసే అసలు సిసలు బ్యాటర్‌. అతనే టీమిండియా సారధి రోహిత్‌ శర్మ. ఇవాళ రోహిత్‌ 37వ పుట్టినరోజు. దశాబ్దంన్నర పాటు సాగిన రోహిత్ క్రికెట్‌ ప్రయాణం ఓ అద్భుతం.


రోహిత్‌ మార్గం అనితర సాధ్యం 


472 అంతర్జాతీయ మ్యాచులు..


18, 820 పరుగులు..


48 సెంచరీలు..


వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు.


ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ ఇదంతా ఊరికే రాలేదు. ఒకప్పుడు జట్టులో చోటే కష్టమైన దశ నుంచి ఆ జట్టునే నడిపించిన స్థాయికి రోహిత్‌ ఎదిగాడు. ICC T20 వరల్డ్ కప్ 2007లో మంచి ప్రతిభతో ఆకట్టుకున్న దగ్గరి నుంచి రోహిత్‌ ప్రయాణం యువ ఆటగాళ్లకు ఓ స్ఫూర్తి. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రోహిత్ ఆకట్టుకునే ప్రదర్శనలతో అంతర్జాతీయ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. తన తరంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా హిట్‌మ్యాన్‌ పేరు తెచ్చుకున్నాడు. 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం దక్కించుకున్న రోహిత్‌ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను పాదాక్రాంతం చేసుకున్నాడు. వన్డేల్లో 10,000 కంటే ఎక్కువ పరుగులను 49.12 సగటుతో సాధించాడు. వన్డేల్లో రోహిత్‌ అత్యధిక స్కోరు 264.


టెస్ట్ క్రికెట్‌లో రోహిత్‌ చెరగని ముద్రను వేశాడు. 45.46 సగటుతో 4,000కు పైగా పరుగులు చేశాడు. కెప్టెన్‌గానూ రోహిత్ విజయవంతం అయ్యాడు. రోహిత్‌ శర్మ తన టెస్ట్‌ కెరీర్‌లో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్‌ తన కెరీర్‌లో చేసిన 12 టెస్ట్‌ సెంచరీలు చేయగా.. అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఇలా ఓ ఆటగాడు చేసిన తన తొలి 12 టెస్ట్‌ సెంచరీలు జట్టు విజయానికి దోహదపడటం క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.  


రోహిత్ శర్మ వన్డే క్రికెట్ కెరీర్
262 వన్డేల్లో 49.12 సగటుతో 10709 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు, 55 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో రోహిత్‌ అత్యధిక స్కోరు 264 . రాహుల్ ద్రవిడ్ (10,768), సౌరవ్ గంగూలీ (11,221), విరాట్ కోహ్లీ (13848), సచిన్ టెండూల్కర్ (18426 పరుగులు) తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్‌ క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 15వ స్థానంలో ఉన్నాడు. విరాట్ (50), సచిన్ (49) తర్వాత అత్యధిక వన్డే శతకాలు చేసిన భారత బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. 59 టెస్టుల్లో 45.46 సగటుతో 4137 పరుగులు చేశాడు. 


ఐపీఎల్‌లో నూ..


ఇక  ఐపీఎల్‌ విషయానికి వస్తే రోహిత్ లో 252 మ్యాచ్‌లలో మొత్తం 6522 పరుగులు చేశాడు.   ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్‌కు రికార్డు స్థాయిలో ఐదు టైటిళ్లు సాధించి పెట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యం అద్భుతమనే చెప్పాలి. ఆ టోర్నమెంట్‌లో రెండో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచి సత్తా చాటాడు.ఇందులో రెండు సెంచరీలు, 42 అర్ధ సెంచరీలు మరియు అత్యుత్తమ స్కోరు 109*. IPL చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.