Ajit Agarkars BCCI selection committee likely to announce Team India today : అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) 2024 కోసం భారత జట్టును అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం కూడా రెండు గంటలపాటు విస్తృతంగా చర్చలు జరిపిన సెలక్షన్‌ కమిటీ రోహిత్‌ శర్మ సారథ్యంలో జట్టును ఎంపిక చేసిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు రేపే చివరి తేదీ కావడంతో అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసిందని... కొన్ని గంటల్లో ఎప్పుడైనా 15మందితో కూడిన జట్టును ప్రకటించే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. సెలక్షన్‌ కమిటీ ఇప్పటికే చర్చల ప్రక్రియను ముగించిందని... 15మందితో జట్టు ప్రకటన సిద్ధంగా ఉందని తెలిపింది. ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఐపీఎల్‌తో పోలిస్తే వెస్టిండీస్‌లో పిచ్‌లు భిన్నంగా ఉండడంతో ఆటగాడి ఫామ్‌... గత మ్యాచుల్లో ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ- యశస్వి జైస్వాల్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. విరాట్‌ కోహ్లీ వన్‌డౌన్‌లో బరిలోకి దిగనున్నాడు. టీ 20 ప్రపంచకప్‌ జట్టులో కొందరు సీనియర్‌ ఆటగాళ్లకు నిరాశ తప్పదన్న వార్తలు వస్తున్నాయి.


నిరాశ తప్పదా..?
ఈ సారి పొట్టి ప్రపంచకప్‌లో ఎలాంటి ప్రయోగాలు ఉండబోవని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. టీమిండియా తరపున నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు..తుది జట్టులో చోటు దక్కుతుందని.... ఇందులో ఎలాంటి ప్రయోగాలు ఉండబోవని ఆ అధికారి స్పష్టం చేశారు. అయితే శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లలో ఒకరికి మాత్రమే జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. లెఫ్ట్‌ హ్యాండర్‌ కాబట్టి జైస్వాల్‌ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మంచి ఫినిషర్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తే కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆటగాడు రింకూ సింగ్, చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేయర్‌ శివమ్ దూబేలలో ఒకరు జట్టులోకి రావచ్చు. వికెట్‌ కీపర్ల విషయంలోనూ తీవ్ర పోటీ నెలకొంది. సంజూ శాంసన్‌, జితేష్ శర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు జట్టులో చోటు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒక కీపర్‌గా రిషభ్‌ పంత్‌ను జట్టులోకీ తీసుకోవడం ఖాయం కాబట్టి ఆ రెండో బెర్తు ఎవరు దక్కించుకుంటారో అన్న ఉత్కంఠ కలుగుతోంది. అయితే రాహుల్‌ వైపు కానీ, ఇషాన్‌ కిషన్‌ వైపు కానీ సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది.


పాండ్యా భవిష్యత్తు ఏంటో..?
హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్.. సెలక్షన్‌ కమిటీని ఆందోళన పరుస్తోంది. కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌గా, బ్యాటర్‌గా అన్ని రకాలుగా కూడా దారుణంగా విఫలమవుతున్న ముంబై కెప్టెన్ హార్దిక్‌ పాండ్యాకు టీ 20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కడం కష్టమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గాయంతో చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్న హార్దిక్‌.. ఐపీఎల్‌ 2024లో పునరాగమనం చేశాడు. కానీ ఇప్పటివరకు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.
విరాట్ కోహ్లీని పొట్టి ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం లాంఛనమే. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ పేర్లు ఖరారైనట్లే. స్పిన్నర్ల విషయంలో యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. రాహుల్ తెవాటియా మంచి ఫినిషర్ అయినా అతడికి జట్టులో చోటు కష్టమే కావచ్చు.


కొత్త స్టార్ల పరిస్థితి ఏంటి...?
రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, నితీశ్‌రెడ్డి వంటి యువ ఆటగాళ్లు ఈ ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేస్తున్నారు. అయితే టీ 20 ప్రపంచకప్‌లో వీరికి స్థానం దక్కడమ కష్టమే అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్ 2024లో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్‌కు రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇచ్చే విషయంపై రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రియాగ్‌ ఈ ఐపీఎల్‌లో ఏడు మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


భారత టీ 20 జట్టు ఇలా( అంచనా):
స్పెషలిస్ట్ బ్యాటర్స్ : రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్/శివమ్‌దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, రిషబ్ పంత్, KL రాహుల్/సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, ముహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్/అవేశ్ ఖాన్