అఫ్గానిస్థాన్‌( Afghanistan)తో జరిగిన తొలి టీ 20లో భారత్‌(Bharat) ఘన విజయం సాధించింది. తొలుత అఫ్గాన్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌... నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 11 బంతులు మిగిలి ఉండగానే రోహిత్‌ సేన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సారధి రోహిత్‌ శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్లలో అతిపెద్ద వయస్కుడిగా రోహిత్ శర్మ నిలిచాడు. నిన్న( గురువారం)  ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయకత్వం వహించి 36 ఏళ్ల 256 రోజుల వయసులో కెప్టెన్‌గా వ్యవహరించిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, శిఖర్ ధావన్‌లను రోహిత్ అధిగమించాడు. 

 

ధావన్‌, ధోనీలను అధిగమించి...

36 ఏళ్ల 256 రోజుల వయసులో కెప్టెన్‌గా వ్యవహరించిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. 2021లో 35 ఏళ్ల 236 రోజుల వయసులో టీ20 మ్యాచ్‌కు శిఖర్‌ ధావన్‌... సారధిగా వ్యవహరించాడు. దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని 35 ఏళ్ల 52 రోజుల వయసులో కెప్టెన్‌గా వ్యవహరించి మూడో స్థానంలో నిలిచాడు. 33 సంవత్సరాల 91 రోజుల వయసుతో నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 33 ఏళ్ల 3 రోజుల వయసుతో అయిదో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. మొత్తం 13 మంది ఆటగాళ్లు ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకి నాయకత్వం వహించారు. 

 

రోహిత్‌ శర్మ మరో ప్రపంచ రికార్డు

పొట్టి క్రికెట్‌లో ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్న హిట్‌మ్యాన్‌.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నిన్న అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్‌ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్‌ ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో గెలిచి... అంతర్జాతీయ స్థాయిలో ఒక జట్టు తరఫున వంద మ్యాచ్‌లలో గెలిచిన ఆటగాడిగా రోహిత్‌ రికార్డులకెక్కుతాడు. 36 ఏళ్ల రోహిత్‌.. ఇప్పటివరకూ భారత్‌ తరఫున 100 మ్యాచ్‌ల విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఒక క్రికెటర్‌ ఇన్ని మ్యాచ్‌లలో గెలిచిన సందర్భాలు లేవు. పాకిస్తాన్‌ మాజీ బ్యాటర్‌ షోయభ్‌ మాలిక్‌.. 86 మ్యాచ్‌లలో గెలిచి రెండో స్థానంలో ఉండగా... టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. 73 విజయాలలో భాగస్వామిగా ఉన్నాడు. పాకిస్తాన్‌ బ్యాటర్‌ మహ్మద్‌ హఫీజ్‌తో పాటు అఫ్గానిస్తాన్‌ మాజీ సారథి మహ్మద్‌ నబీలు 70 విజయాలలో భాగస్వాములుగా ఉన్నారు.