భారత్(Bharat) వేదికగా జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లాండ్(England) క్రికెట్ జట్టు సిద్ధమవుతోంది. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఈ టెస్టు సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ కోసం నెలన్నర రోజుల ముందుగానే 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. భారత్ వంటి ఉపఖండపు పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఇంగ్లిష్‌ టీమ్‌(Team England)కు సారథ్యం వహించనుండగా.. వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌, జో రూట్‌తో పాటు బెయిర్‌స్టో, బ్రూక్‌, క్రాలీ, డకెట్‌, ఫోక్స్‌, లీచ్‌, పోప్‌, రాబిన్‌సన్‌, మార్క్‌ వుడ్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. 16 మందితో కూడిన జట్టు ఎంపికలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పలు అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. ఏకంగా ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. టామ్ హార్డ్లీ, గట్కిన్సన్, షోయబ్ బాషిర్‌ టెస్టులోకి అరంగేట్రం చేయనున్నారు. అయితే ఈ హై వోల్టేజ్‌ సిరీస్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తమ జట్టుకు కీలక హెచ్చరికలు చేశాడు. 

 

కోహ్లీని కవ్వించొద్దు

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి(Virat Kohli) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రేమ్‌ స్వాన్‌ ఇంగ్లీష్‌ జట్టును హెచ్చరించాడు.ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లిని స్లెడ్జింగ్‌ చెయ్యొద్దని.. ఆలా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తమ జట్టును స్వాన్‌ హెచ్చరించాడు. 2012లో టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత్‌కు వెళ్లినప్పుడు అప్పటి మేనెజ్‌మెంట్‌ తమకు కొన్ని ఆదేశాలు ఇచ్చిందని స్వాన్‌ గుర్తు చేసుకున్నాడు. ఫీల్డ్‌లో విరాట్ కోహ్లితో ఏమీ మాట్లాడొద్దని తమను ముందే హెచ్చరించారని స్వాన్‌ తెలిపాడు. ఫీల్డ్‌లో స్లెడ్జింగ్‌ను విరాట్‌ ఆస్వాదిస్తాడని.... ఆ సిరీస్‌ నాలుగో టెస్టులో స్టీవెన్ ఫిన్ బౌలింగ్‌లో కోహ్లి వరుసగా రెండు అద్భుతమైన బౌండరీలు బాదాడని స్వాన్‌ గుర్తు చేసుకున్నాడు. సహనం కోల్పోయిన స్టీవెన్ ఫిన్‌... విరాట్‌ కోహ్లీని స్లెడ్జ్‌ చేశాడని స్వాన్‌ తెలిపాడు. అంతే ఆ తర్వాత ఫిన్‌ను టార్గెట్‌ చేశాడని.. విరాట్ తన సత్తా చూపించాడని స్వాన్‌ పేర్కొన్నాడు. సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని కూడా స్వాన్‌ తెలిపాడు. 

 

బ్యాటింగ్‌ కోచ్‌గా కార్తీక్‌

 

భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టుకు(England Lions)... టీమిండియా మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌(Dinesh Karthik ) బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌( batting consultant)గా పని చేయనున్నాడు. ఈ పర్యటనలో భాగంగా భారత ‘ఎ’ జట్టుతో ఇంగ్లండ్‌ అహ్మదాబాద్‌లో 3 నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టూర్‌ తొలి 9 రోజుల పాటు కార్తీక్‌ ఇంగ్లండ్‌ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు. హెడ్‌ కోచ్‌ నీల్‌ కిలీన్‌ నేతృత్వంలో దినేశ్‌ కార్తీక్ పని చేస్తాడు.

 

టీమిండియా ఏ జట్టు ప్రకటన

ఇంగ్లండ్‌(England)తో టీమిండియా(Team India) టెస్టు సిరీస్‌కు ముందు.. వామప్‌ మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(The Board of Cricket Control for India) BCCI భారత్‌ ఏ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్‌ లయన్స్‌తో తలపడేందుకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. బెంగాల్‌ క్రికెటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ భారత్‌ ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 12- 20 మధ్య ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. ఇంగ్లండ్‌ లయన్స్‌-భారత్‌-‘ఏ’ జట్టుతో ఈ మేరకు వామప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 12 నుంచి 13 వ తేదీ వరకు నరేంద్ర మోఢీ స్టేడియంలో రెండు రోజుల వామప్‌ మ్యాచ్ జరగనుండగా... జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు అదే స్టేడియంలో నాలుగు రోజుల మ్యాచ్‌ జరగనుంది.