అఫ్గానిస్థాన్( Afghanistan)తో జరిగిన తొలి టీ 20లో భారత్(Bharat) ఘన విజయం సాధించింది. తొలుత అఫ్గాన్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్... నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 11 బంతులు మిగిలి ఉండగానే రోహిత్ సేన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్... భారత బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ తో పాటూ ముఖేష్ చెరో 2 వికెట్లు తీసి రాణించారు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘానిస్తాన్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం అందించారు.. ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. అదే స్కోర్ వద్ద మరో ఓపెనర్ ను శివమ్ దూబే పెవిలియన్ కు పంపాడు. దీనితో 50 పరుగుల వద్ద ఒక్క వికెట్ కోల్పోకుండా పటిష్టంగా కనిపించిన అఫ్గాన్.. అదే స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఒమ్రాజాయ్ 22 బంతుల్లో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మహ్మద్ నబీ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో అఫ్గాన్ పోరాడే స్కోరును సాధించింది. 27 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. నబీని ముఖేశ్ కుమార్ అవుట్ చేశాడు .మిగిలిన బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించలేదు. టీం ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
దూబే అర్ధ శతకం
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్లోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. 14 నెలల తర్వాత టీ 20ల్లో బరిలోకి దిగిన సారధి రోహిత్ శర్మ.. ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. సమన్వయ లోపం కారణంగా రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఒక్క పరుగు చేయకుండానే.. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరకుండానే హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. కానీ శుభమన్ గిల్, తిలక్ వర్మ భారత్‌ను ఆదుకున్నారు. ఉన్నంత సేపు గిల్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 12 బంతుల్లో అయిదు ఫోర్లతో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్ వర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 26 పరుగులు చేశాడు. భారత్ విజయం దిశగా సాగుతున్న సమయంలో మరో రెండు వికెట్లు నేలకూలాయి. కానీ శివమ్ దూబే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
కేవలం 40 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సులతో దూబే 60 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీమిండియాకు విజయాన్ని అందించాడు. దూబేకు జితేశ్ శర్మకు చక్కటి సహకారం అందించాడు. కేవలం 20 బంతుల్లో అయిదు ఫోర్లతో జితేశ్ 31 పరుగులు చేశాడు. చివర్లో నయా ఫినిషర్ రింకూ సింగ్ మెరుపు ముగింపును ఇచ్చాడు. 9 బంతుల్లో రెండు ఫోర్లతో 16 పరుగులు చేశాడు. శివమ్ దూబే, జితేశ్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా 17.3 ఓవర్లలోనే మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. 60 పరుగులతో పాటు ఒక వికెట్‌ను కూడా నేలకూల్చిన శివమ్ దూబే... మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.