మూడు మ్యాచుల టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా(Team India).. అఫ్గాన్‌(Afghanistan)ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. పంజాబ్‌(Punjab) లోని మొహాలీ(mohali) వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్‌ బరిలోకి దిగింది. 14 నెలల తర్వాత పొట్టి క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్‌ శర్మ(Rohit Sharma) తిరిగి ఈ ఫార్మాట్‌లో సారథ్య బాధ్యతలు చేపట్టనుండటంతో ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారింది. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ తీసుకుంది.

 

భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్‌ దూబే, జితేష్, రింకూసింగ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్ సింగ్‌, ముఖేష్ కుమార్‌.

 

అఫ్గానిస్థాన్‌ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్,  గుల్బాదిన్ నాయబ్,  షరఫుద్దీన్ అష్రాఖ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్

 

గిల్‌-రోహిత్‌ ఓపెనింగ్‌

రోహిత్‌ శర్మతోకలిసి భారత ఇన్నింగ్స్‌ను శుభమన్‌ గిల్‌  ఆరంభించనున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో పెద్దగా రాణించని శుభమన్‌ గిల్‌ అఫ్గానిస్తాన్‌పై సత్తా చాటడం ద్వారా తిరిగి గాడిలో పడాలని కోరుకుంటున్నాడు. మిడిల్‌ఆర్డర్‌లో రింకూ సింగ్‌ కీలకం కానున్నాడు. వికెట్‌కీపర్‌గా జితేశ్‌ శర్మకు తుదిజట్టులో చోటు దక్కింది. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కింద శివమ్‌ దుబే, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల కింద అక్షర్‌పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి తీసుకున్నారు. అర్షదీప్‌, ముఖేష్‌ కుమార్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా రవిబిష్ణోయ్‌కు తుదిజట్టులో స్థానం దక్కింది.

 

తక్కువ అంచనా వేస్తే కష్టమే...

మరోవైపు అఫ్గానిస్తాన్‌ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కీలక ఆటగాడు, స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ లేకుండా ఆ జట్టు బరిలోకి దిగుతోంది. గత ఏడాది వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న రషీద్‌ ఖాన్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పెద్ద పెద్ద జట్లను ఓడించి అఫ్గానిస్తాన్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.ఈ టీ20 సిరీస్‌లో భారత్‌పై కూడా సత్తా చాటాలని అఫ్గాన్ జట్టు కోరుకుంటోంది. మ్యాచ్‌ గురువారం రాత్రి 7 గంటలకు ఆరంభంకానుంది.

 

ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కంటే ముందు భారత్‌ ఆడనున్న చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 14 నెలల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్‌ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లీ(Virat Kohli)పై అందరి దృష్టి నెలకొంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌(T20 World Cup)కు ముందు చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది.