IPL 2024: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL 2024)లో మినీ వేలం ప్రక్రియ ముగిసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్‌ క్రికెట్‌(Cricket) సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి 23 నుంచి మే 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్టు 74 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. అందుబాటులో ఉన్న ప్లేయర్లు ప్రాంచైజీల పర్యవేక్షలో ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. 2023 ఐపీఎల్ టోర్నీని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు గెలుచుకుంది. ఇప్పటికే అయిదుసార్లు కప్పును గెలుచుకున్న చెన్నై మరోసారి కప్పును ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. చెన్నై సారధి ఎం.ఎస్. ధోనీ( MS Dhoni) మరోసారి జట్టును విజేతగా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు. అద్భుతమైన కెప్టెన్సీతో ఇప్పటికే అయిదుసార్లు జట్టుకు కప్పు అందించిన ధోనీ ఆరోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో మరోసారి తనసత్తాను చూపేందుకు తలైవా సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 టోర్నీకి సంబంధించి ధోనీ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ తలైవా వచ్చేశాడోచ్ అని కామెంట్లు చేస్తున్నారు. 

 

ధోనీ బరిలోకి దిగడం ఖాయం

ఐపీఎల్ 2023 తరువాత  ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. గతేడాది టోర్నీ సమయంలో ధోనీ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో ఎంఎస్ ధోనీ పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే  ధోనీ ఫిట్ గా ఉన్నాడని, రాబోయే సీజన్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన సీఎస్కే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు. ఇప్పుడు ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టడంతో అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. 

 

ధోనీ సమాధానానికి ఫిదా

క్రికెట్‌ నుంచి పూర్తిగా వైదొలిగిన తర్వాత మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అని ఓ ప్రశ్న ధోనీకి ఎదురైంది. మాములుగా అయితే మాజీ క్రికెటర్లు వ్యాఖ్యాతలుగా మారుతాం క్రికెట్ అకాడమీలు పెడతామని చెప్తారు. కానీ అక్కడున్నది ధోనీ కదా అందుకే మరోలా స్పందించాడు. ఇప్పటివరకైతే తాను దాని గురించి ఆలోచించలేదని... కానీ క్రికెట్‌ నుంచి పూర్తిగా వైదొలిగిన తర్వాత ఆర్మీలో ఎక్కువ సమయం గడుపుతానంటూ ధోనీ జవాబు ఇచ్చాడు. కొన్నేళ్లుగా తాను భారత సైన్యంతో ఎక్కువ సమయం గడపలేదని.. దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ధోనీ అన్నాడు. ఎంఎస్ ధోనీ సమాధానం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇంకా ధోనీ మాట్లాడుతూ తాను ఇప్పటికీ క్రికెట్‌ ఆడుతున్నాని.. క్రికెట్‌ తర్వాత ఏం చేస్తాననేది ఆలోచిస్తుంటే తనకు ఆసక్తికరంగానే ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మూడేళ్ల కిందట ధోనీ వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కలిగిన ధోనీకి వచ్చే ఐపీఎల్‌ సీజనే చివరిదని అంతా భావిస్తున్నారు.