అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన తొలి నేపాల్‌ ప్లేయర్ సందీప్ లామిచానే(Sandeep Lamichhane)ను దోషిగా తేల్చిన నేపాల్‌ కోర్టు(Nepal Court).. అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. లామిచానెకు జైలు శిక్ష విధించడంతో నేపాల్‌ క్రికెట్‌ సంఘం(Nepal Cricket Board)  అతడిపై నిషేధం విధించింది. అత్యాచారం కేసులో దోషిగా తేలి, జైలు శిక్షకు గురైన సందీప్‌ లామిచానెను ఎలాంటి దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడకుండా సస్పెండ్‌ చేస్తున్నామని నేపాల్‌ క్రికెట్‌ సంఘం వెల్లడించింది. ఖాట్మండు జిల్లా కోర్టులోని ఏకసభ్య ధర్మాసనం 23 ఏళ్ల లామిచానెకు జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. బాధితురాలికి రూ.2 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది. 2022 ఆగస్టులో ఓ హోటల్‌ గదిలో తనపై అత్యాచారం చేశాడని లామిచానెపై ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 



అసలేం జరిగిందంటే.,..
 అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన తొలి నేపాల్‌ ప్లేయర్ సందీప్ లామిచానే(Sandeep Lamichhane)కు షాక్ తగిలింది. మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో లమిచానెను దోషిగా తేల్చిన నేపాల్‌ కోర్టు(Nepal Court).. అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఖరారుచేసింది. అంతేకాకుండా 3,00,000 నేపాలీ రూపాయలు జరిమానా విధించింది. మరో 2,00,000 నేపాలి రూపాయలు బాధితురాలికి చెల్లించాలని పేర్కొంది. 2022 ఆగస్టులో లమిచానె.. ఖాట్మాండులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డట్టు కేసు నమోదుకాగా సుమారు ఏడాదిన్నర విచారణ తర్వాత కోర్టు అతడిని దోషిగా తేల్చింది.


అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలు మైనర్‌. కానీ విచారణ సందర్భంగా ఆమెకు 18 ఏళ్లని కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణలో జాప్యం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆరోపణల నేపథ్యంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన తర్వాత స్వదేశానికి వచ్చిన లామిచానెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాల అనంతరం నేపాల్ క్రికెట్ బోర్డు అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించింది. తరువాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన లామిచానె.. అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్, 2023 ఆసియాకప్‌లో నేపాల్ జట్టు తరఫున ఆడాడు. కానీ అతడిపై అత్యాచార ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా స్కాట్లాండ్ క్రికెటర్లు.. అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. 2018 వరకూ ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడిన లమిచానె ఆ తర్వాత నేపాల్‌కు వలసవెళ్లాడు. వన్డేలలో అత్యంత వేగంగా 50వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. నేపాల్‌ తరఫున 51వన్డేలు, 52టి20లు ఆడిన లమిచానె.. వన్డేలలో112 వికెట్లు, టీ20లలో 98 వికెట్లు పడగొట్టాడు.



టీ 20 ప్రపంచకప్‌లో నేపాల్‌
అన్ని గ్రూపుల కంటే గ్రూప్-డి పటిష్టంగా కనిపిస్తోంది. ఈ గ్రూప్ నుంచి సూపర్-8కు వచ్చే జట్లను ముందే ఊహించడం కష్టంగా మారింది. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా, శ్రీలంక. బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టీ 20 క్రికెట్‌లో ఈ రెండు జట్లు అద్భుతాలు సృష్టించగలవు. ఇప్పటికే దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ రెండుసార్లు ఓడించింది. గత టీ20 ప్రపంచకప్‌తో పాటు గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. మరోసారి ఈ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.