Rohit Sharma: 


కొన్నేళ్లుగా ఒకే సమస్య నిరంతరం వేధిస్తోందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అన్నాడు. నాలుగో స్థానంపై ఇప్పటికీ అనిశ్చితి నెలకొందని చెప్పాడు. ఆటగాళ్లు గాయాల పాలవ్వడమే ఇందుకు కారణమని పేర్కొన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ మిడిలార్డర్లో బాగానే రాణించారని తెలిపాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు (ICC Odi Worldcup 2023) వారిలో ఎవరెవరు అందుబాటులోకి వస్తారో చూడాలని తెలిపాడు.


యువరాజ్‌ సింగ్‌ (Yuvraj singh) తర్వాత టీమ్‌ఇండియాకు నంబర్‌ ఫోర్‌లో ఆడే ఆటగాడు దొరకలేదు. 2019 వన్డే ప్రపంచకప్‌ ముందు జట్టు అనేక ప్రయోగాలు చేసింది. అంబటి రాయుడికి ఎక్కువ ఛాన్సులిచ్చింది. బాగానే రాణించినా తీరా మెగా టోర్నీలో అతడిని పక్కన పెట్టేసింది. ఇక 2019 నుంచి ఇప్పటి వరకు 11 మందిని నాలుగో స్థానంలో ప్రయత్నించారు. శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer), రిషభ్ పంత్‌ (Rishabh Pant) చెరో 10 మ్యాచుల్లో ఇదే స్థానంలో ఆడారు. వీరిద్దరూ గాయపడటంతో సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ను (Sanju Samson) ప్రయత్నిస్తున్నారు. కానీ వారిద్దరిలో ఎవరూ అంచనాలను అందుకోవడం లేదు.


'చూడండి, సుదీర్ఘ కాలంగా నాలుగో స్థానం మాకో సమస్యగా మారింది. చాలా కాలం పాటు శ్రేయస్‌ అయ్యర్‌ ఈ స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. అతడి గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. అతడితో పాటు చాలామంది వచ్చిపోయారు. గాయాలతో కొందరు, ఫామ్‌ లేమితో మరికొందరు దూరమయ్యారు. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) నాలుగు నెలలుగా అందుబాటులో లేరు. గాయాలు, శస్త్రచికిత్సలే ఇందుకు కారణాలు. సర్జరీ చేయించుకున్నా పునరాగమనం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. వారెలా స్పందిస్తారో చూడాలి' అని రోహిత్‌ శర్మ అన్నాడు.


శ్రేయస్‌ అయ్యర్‌ ఆడిన 38 వన్డే ఇన్నింగ్సుల్లో 20 వరకు నాలుగో స్థానంలోనే వచ్చాడు. 47.35 సగటుతో 805 పరుగులు చేశాడు. ఐపీఎల్‌కు ముందు వెన్నెముక గాయంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. కోలుకున్నాక జులైలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. ఆసియా, వన్డే ప్రపంచకప్‌లకు అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు.


'దురదృష్టవశాత్తు శ్రేయస్‌ అయ్యర్‌ను గాయాలు ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. చాలా కాలం బాగానే ఆడాడు. నాలుగైదేళ్లుగా ఇదే జరుగుతోంది. చాలా మంది గాయపడటంతో మళ్లీ కొత్తవాళ్లు వస్తున్నారు. దాంతో వారితోనే ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav) చాలా కష్టపడుతున్నాడు. వన్డేల్లో అనుభవజ్ఞులను కలిసి మాట్లాడుతున్నాడు. మైండ్‌సెట్‌ మార్చుకుంటున్నాడు. అతడిలాంటి బ్యాటర్‌కు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరంభంలో నాలుగైదు మ్యాచుల్లో అతడేమీ ఆడలేదు. ఆ తర్వాత డిఫరెంట్‌గా కనిపించాడు. ఒకట్రెండు మ్యాచుల్లో ఆడనంత మాత్రాన నేరుగా పక్కన పెట్టేయొద్దు' అని రోహిత్‌ అన్నాడు.


'వెస్టిండీస్‌తో మూడో టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఏం చేశాడో చూశాం కదా! టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పుడు అతడే నిలబడ్డాడు. అయితే వన్డేల్లో నాలుగో స్థానంలో ఎలా కుదురుకుంటాడో చూడాల్సి ఉంది' అని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు. ఆసియాకప్‌లో టీమ్‌ఇండియాను గెలిపించడమే తమ లక్ష్యమని జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ వంటి పేసర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందన్నాడు.


Also Read: