Yuvraj Singh: ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ నెమ్మదిగా దగ్గరవుతున్నాయి. కానీ భారత జట్టు నంబర్ 4 సమస్య ఇంకా సాల్వ్ కాలేదు. రాబోయే టోర్నీలను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో నంబర్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. వన్డేల్లో నాలుగో నంబర్ కోసం వెతకడం తమకు పెద్ద సవాల్‌గా మారిందని రోహిత్ శర్మ అన్నాడు.


యువరాజ్ సింగ్ తర్వాత ఎవరూ నాలుగో స్థానంలో సరిగ్గా నిలవలేకపోయారని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. భారత కెప్టెన్ మాట్లాడుతూ, “చాలా కాలంగా నంబర్ ఫోర్ మాకు సమస్యగా ఉంది. యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థానంలో ఎవరూ సరిగ్గా ఆడలేకపోయారు. కానీ చాలా కాలంగా శ్రేయస్ అయ్యర్ నంబర్ 4లో బాగా బ్యాటింగ్ చేశాడు. అతని గణాంకాలు కూడా చాలా బాగున్నాయి." అన్నారు.


వన్డేల్లో అయ్యర్ గణాంకాలు ఇలా...
2017 డిసెంబర్‌లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 42 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 38 ఇన్నింగ్స్‌ల్లో అతను 46.60 సగటుతో 1631 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి రెండు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు వచ్చాయి. ఇందులో అతని అత్యధిక స్కోరు 113 నాటౌట్‌గా ఉంది. అయ్యర్ వన్డేల్లో 162 ఫోర్లు, 32 సిక్సర్లు కొట్టాడు.


నాలుగో స్థానంలో ఉన్న అయ్యర్ వన్డేల్లో 20 ఇన్నింగ్స్‌లలో 47.35 సగటుతో 805 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు వచ్చాయి. వన్డేల్లో తన అత్యధిక స్కోరును నాలుగో స్థానంలోనే సాధించాడు.


అయ్యర్ భారతదేశం తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. 42 వన్డేలు కాకుండా ఇప్పటి వరకు 10 టెస్టులు, 49 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 16 ఇన్నింగ్స్‌ల్లో 44.40 సగటుతో 666 పరుగులు చేశాడు. అయ్యర్ టెస్టుల్లో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా అతను టీ20 ఇంటర్నేషనల్‌లో 30.67 సగటుతో, 135.95 స్ట్రైక్ రేట్‌తో 1043 పరుగులు చేశాడు. 


మరోవైపు ప్రపంచకప్ టికెట్ సేల్స్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చేసింది. టీమిండియా మినహా మిగతా అన్ని మ్యాచుల టికెట్ల విక్రయం ఆగస్టు 25వ తేదీ నుంచి మొదలవుతుంది. మొదట వార్మప్‌ ఆ తర్వాత లీగ్‌ మ్యాచుల టికెట్లు అమ్ముతారు. ఆపై ఆరు దశల్లో టీమ్‌ఇండియా తలపడే మ్యాచులు టికెట్లు ఇస్తారు. సెప్టెంబర్‌ 30వ తేదీన గువాహటిలో ఇంగ్లాండ్‌, అక్టోబర్‌ 3వ తేదీన తిరువనంతపురంలో శ్రీలంక లేదా నెదర్లాండ్స్‌తో రోహిత్‌ సేన వార్మప్‌ మ్యాచులు ఆడుతుంది. మొదట ఈ మ్యాచ్‌ల టికెట్లు అమ్ముతారు.


ఆగస్టు 25వ తేదీ: టీమ్‌ఇండియా మినహా మిగతా జట్ల వార్మప్‌, లీగ్‌ మ్యాచులు టికెట్ల విక్రయం
ఆగస్టు 30వ తేదీ: గువాహటి, తిరువనంతపురంలో టీమ్‌ఇండియా ఆడే వార్మప్‌ మ్యాచుల టికెట్ల విక్రయం
ఆగస్టు 31వ తేదీ: ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా మ్యాచుల టికెట్ల విక్రయం
సెప్టెంబర్ 1వ తేదీ: న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, శ్రీలంకతో టీమ్ఇండియా మ్యాచుల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్‌ 2వ తేదీ: దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో టీమ్‌ఇండియా మ్యాచుల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్‌ 3వ తేదీ: అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లో భారత్‌ x పాకిస్థాన్ మ్యాచు టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్‌ 15వ తేదీ: సెమీ ఫైనల్స్, ఫైనల్‌ మ్యాచు టికెట్ల అమ్మకాలు


Also Read: పాకిస్తాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్, అజేయంగా సెమీస్ చేరిన హాకీ టీమ్