Rohit and Virat are two of the greats of the modern era- Joe Root : భారత్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్ల గురించి ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటగాళ్లని వ్యాఖ్యానించాడు. టెస్టు సిరీస్‌లో భారత్‌ కూడా దూకుడుగానే ఆడుతోందన్న రూట్‌... కోహ్లీ జట్టులో లేకపోయినా టీమ్‌ఇండియా బలంగానే ఉందన్నాడు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో కోహ్లీ, రోహిత్ అత్యుత్తమ ఆటగాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదని రూట్‌ అన్నాడు. కోహ్లీ, రోహిత్‌... మిగిలిన ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తారని అన్నాడు. రోహిత్‌, కోహ్లీ ఇద్దరినీ వీలైనంత త్వరగా ఔట్‌ చేయగలిగితే దాదాపు మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నాడు.  వారు ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే ఆపడం చాలా కష్టమని రూట్‌ తెలిపాడు.


కోహ్లీ కష్టమే..?
గాయాలతో సతమతమవుతున్న టీమిండియా(Team India)కు పెద్ద షాక్‌ తగిలింది. మూడో టెస్ట్ నుంచి విరాట్‌ కోహ్లీ(Virat Kohli) జట్టులోకి వస్తాడనుకుంటున్న వేళ... విరాట్‌ అందుబాటులో ఉండడన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో మొదలయ్యే మూడో టెస్టుతో పాటు రాంచీలో జరిగే నాలుగో టెస్టుకు జట్టులోకి వచ్చే అవకాశాలు లేనట్లు వార్తలు వస్తున్నాయి. భారత్, ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు ఈనెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి 27 వరకు రాంచీలో జరగనున్నాయి. ధర్మశాలలో మార్చి 7నుంచి మొదలయ్యే ఆఖరి టెస్టుకైనా కోహ్లీ అందుబాటులో ఉంటాడా అన్నది అనుమానంగా మారింది. జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై కోహ్లి బీసీసీఐకి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. విరాట్‌ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.



అదే కారణమా..?
టీమ్ఇండియా(Team India) స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరోసారి తండ్రి కాబోతున్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరంగా ఉన్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ ఫ్రెండ్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా యూట్యూబ్ లైవ్‌లో ఏబీ డివిలియర్స్‌ అభిమానులతో ముచ్చటించాడు. విరాట్ కోహ్లీతో మాట్లాడారా? అతను బాగున్నారా? అని ఓ అభిమాని ఆయన్ని అడిగాడు. ‘‘ఇటీవల అతడితో చాటింగ్ చేశా. ఎలా ఉన్నావు అని అడిగా. క్షేమంగా ఉన్నానని చెప్పాడు. అతను తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. అందుకే ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నా. కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు అతడు తన కుటుంబంతో ఉండటం ముఖ్యం. విరాట్ తన ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇస్తున్నాడని చాలా మంది భావిస్తుండొచ్చు. కానీ, అది తప్పు. కోహ్లీని మేం కూడా మిస్‌ అవుతున్నాం. అతడు కచ్చితంగా సరైన నిర్ణయం తీసుకున్నాడని డివిలియర్స్‌ అన్నాడు.


2017లో అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 2021లో వీరికి వామిక జన్మించింది. కోహ్లీ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వాటిని కోహ్లీ సోదరుడు వికాస్‌ కొట్టిపారేశాడు. తమ తల్లి ఆరోగ్యంగానే ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఇక, ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకు త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఆ మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.