who will become BCCI secretary after Jay Shah:  ఇప్పుడు భారత క్రికెట్‌లో చర్చంతా బీసీసీఐ(BCCI) కార్యదర్శి పదవి చుట్టే తిరుగుతోంది. భారత క్రికెట్‌(Indian Cricket)లో అత్యంత శక్తివంతమైన ఈ పదవిపై ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న  జై షా(Jay shah)... ఐసీసీ ఛైర్మన్‌గా వెళ్తారనే ప్రచారంతో తర్వాత బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు నియమితులవుతారనే దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా వెళ్తే.. ఆస్థానంలో మరో బీజేపీ నేత కుమారుడితోనే భర్తీ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో బీసీసీఐలో వారసత్వ పదవిపై విమర్శలు చెలరేగుతున్నాయి. 




 

అరుణ్‌ జైట్లీ కుమారుడేనా..?

బీసీసీఐ కార్యదర్శిగా టీమిండియా దిగ్గజ క్రికెటర్లలో ఎవరూ ఒకరు బాధ్యతలు చేపడతారని మొన్నటివరకూ వార్తలు వచ్చాయి. అనిల్‌ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లలో ఎవరో ఒకరు ఈ పదవి చేపడతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇవి నిజంగానే ఊహాగానాలనీ తేలిపోయింది. ఇప్పుడు ఢిల్లీ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత అరుణ్‌ జైట్లీ(Arun Jaitley) కుమారుడి పేరు... బీసీసీఐ కార్యదర్శి పదవి చేపడతారని వినపడుతోంది. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎన్నిక ఖరారైపోయిందని... బీసీసీఐ కార్యదర్శిగా జై షా స్థానాన్ని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి, దివంగత  అరుణ్‌ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ(Rohan Jaitley) భర్తీ చేస్తారని తెలుస్తోంది. జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైతే అతడి వారసుడిగా రోహన్‌ జైట్లీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది. బీసీసీఐలో అత్యంత శక్తివంతమైన ఈ పదవి కోసం చాలా మంది పోటీలో ఉన్నా రోహన్‌ జైట్లీ పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రోహన్‌ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా రోహన్‌ జైట్లీ నియమాకం దాదాపు ఖరారైపోయిందని.,.. జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవ్వగానే రోహన్‌ బాధ్యతలు స్వీకరిస్తారని అంటున్నారు. 

 

ఐసీసీ ఛైర్మన్‌పై నేడే స్పష్టత

బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా ఐసీసీ ఛైర్మన్‌ పదవికి పోటీ పడతారా లేదా అన్నది ఈరోజుతో తేలిపోనుంది. ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్‌ను సమర్పించడానికి ఆగస్టు 27 వరకే గడువు ఉంది. కాబట్టి ఇవాళ జై షా నామినేషన్‌ దాఖలు చేస్తే ఐసీసీ రేసులో ఉన్నట్లే. లేకపోతే జై షా ఐసీసీ ఛైర్మన్‌ రేసులో తప్పుకున్నట్లే.  ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న బార్‌ క్లే.. ఈ ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేస్తారు. మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు బార్‌ క్లే ఆసక్తి చూపలేదు. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నిక కావాలంటే బోర్డులోని 16 మంది సభ్యుల్లో కనీసం 9 మంది మద్దతు కావాలి. అయితే జై షాకు ఐసీసీ బోర్డులోని 16 మంది సభ్యుల్లో 15 మంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఐసీసీ ఛైర్మన్‌గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.