BCB decission about  Shakib Al Hasan: పాకిస్థాన్‌(Pakistan)పై ఘన విజయంతో బంగ్లాదేశ్‌(Bangladesh) జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ ఆందోళనలతో అట్టుడుకిన బంగ్లాదేశ్‌కు ఈ విజయం కాస్త ఉపశమనం కలిగించింది. టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన పాకిస్థాన్‌ ఆతి విశ్వాసాన్ని... బంగ్లాదేశ్‌ ఆత్మ విశ్వాసంతో చావు దెబ్బ కొట్టింది. పది వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. అయితే బంగ్లాదేశ్‌ టెస్ట్‌ చరిత్రలో ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగినది అనడంలో ఎలాంటి సందేశం లేదు. అయితే ఈ మధుర క్షణాలను ఆస్వాదించేలోపే బంగ్లాదేశ్‌ జట్టుకు షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌(Shakib Al Hasan) జైలుకు వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.


 

చారిత్రక విజయం 

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రావల్పిండి టెస్ట్‌లో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించింది. టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జట్టు మొదటిసారి పాక్‌పై ఘన విజయం సాధించి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఆగస్టు 30 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌ జరగనుంది. ఇది ఇరు జట్లకు మరింత ప్రతిష్టాత్మకంగా మారనుంది. అయితే బంగ్లాదేశ్ కంటే పాకిస్థాన్‌కే ఈ మ్యాచ్‌ మరింత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌ డ్రా అయినా... పరాజయం పాలైనా పాక్ సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో రెండో టెస్ట్‌ బంగ్లాకు చెలగాటం... పాక్‌కు ప్రాణ సంకటంగా మారింది. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకోనుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రావల్పిండి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న వేళ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్‌ను జాతీయ జట్టు నుంచి వెంటనే తొలగించాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు లీగల్‌ నోటీసు అందింది. ఎందుకంటే ఇప్పటికే షకీబుల్‌ హసన్‌పై బంగ్లాదేశ్‌లో మర్డర్‌ కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లో ఉద్యమం వేళ ఓ విద్యార్థిని కాల్చి చంపిన ఘటనలో షకీబుల్‌ హసన్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదైంది. షకీబుల్‌తో పాటు బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాపైనా ఈ కేసు నమోదు చేశారు.  ఈ పరిస్థితుల్లో షకీబుల్‌ను రెండో టెస్టుకు అనుమతిస్తారా...లేదా అతడు జైలోకి వెళ్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. 

 

బంగ్లా బోర్డు కీలక ప్రకటన

రావల్పిండి టెస్టు సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్.. షకీబుల్‌ హసన్‌ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 30న రావల్పిండిలో జరగనున్న రెండో టెస్టులోపు షకీబ్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. అది ఏ నిర్ణయం అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ క్లిష్ట పరిస్థితిలో షకీబుల్‌ హసన్‌ రాబోయే మ్యాచ్‌లో బంగ్లా జట్టులో ఆడతాడా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు తొలి టెస్టులో షకీబ్ అల్ హసన్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్.. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. పాక్‌పై బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు.