Riyan Parag, Ranji Trophy 2022-23:


యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ రెచ్చిపోయాడు! ఉప్పల్‌ మైదానంలో రికార్డులు బద్దలు కొట్టాడు. హైదరాబాద్‌తో రంజీ మ్యాచులో 278.57 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 28 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. 8 బౌండరీలు, 6 సిక్సర్లు దంచికొట్టాడు. అంతకు ముందు బంతితోనూ రాణించాడు. 48 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.


హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ మ్యాచులో అస్సాం దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్సులో 179 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సరికి 39 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 182 రన్స్‌ సాధించింది. సరుపమ్‌ పురకాయస్త (22 బ్యాటింగ్‌; 43 బంతుల్లో 3x4), ఆకాశ్‌ సేన్‌గుప్తా (4 బ్యాటింగ్; 25 బంతుల్లో 1x4) అజేయంగా నిలిచారు. ఈ ఇన్నింగ్సులో చిచ్చర పిడుగు రియాన్‌ పరాగ్‌ ఆటే హైలైట్‌.


మూడు పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అస్సాం స్వల్ప స్కోర్లకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. కునాల్‌ సైకియా (8), రాహుల్‌ హజారికా (5) త్వరగా ఔటయ్యారు. పిచ్‌ మందకొడిగా ఉండటం, బౌలర్లకు అనుకూలిస్తుండటంతో బ్యాటింగ్‌ కష్టంగా మారింది. ఇలాంటి సిచ్యువేషన్లో రియాన్‌ పరాగ్‌ రెచ్చిపోయాడు.




క్రీజులోకి రావడంతోనే రియాన్‌ బౌండరీలు, సిక్సర్ల వేట మొదలు పెట్టాడు. రిషభ్‌ దాస్‌ (34; 47 బంతుల్లో 6x4)తో కలిసి మూడో వికెట్‌కు 60 బంతుల్లో 101 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అస్సామ్‌కు మంచి ఆధిక్యం అందించాడు. వీరిద్దరూ జట్టు స్కోర 130 వద్దే వెనుదిరగడంతో స్కోరువేగం తగ్గింది. మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. చివరికి 182/6తో నిలిచింది.


మ్యాచ్‌ వివరాలు


అస్సామ్‌ తొలి ఇన్నింగ్స్‌: 56.4 ఓవర్లకు 205 ఆలౌట్‌; సరుపమ్‌ పురుకాయస్త (83)
హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ : 66.5 ఓవర్లకు 208 ఆలౌట్‌; రోహిత్‌ రాయుడు (60)
అస్సామ్‌ రెండో ఇన్నింగ్స్‌ : రెండో రోజు ఆట ముగిసే సరికి 39 ఓవర్లకు 182/6; రియాన్‌ పరాగ్‌ (78)