Boxing Day Test:  క్రికెట్ మైదానాల్లో ప్రమాదాలు జరగడం సాధారణమే. బంతి బ్యాటర్ కు తగలడం, ఫీల్డింగ్ చేసేటప్పుడు ఆటగాళ్లు గాయపడడం షరా మాములే. అయితే మ్యాచును కవర్ చేయడానికి ఉపయోగించే సాంకేతికత పరికరాల వల్ల ప్లేయర్లు గాయపడడం ఎప్పుడైనా చూశారా. బహుశా ఎప్పుడూ అలా జరగలేదు. అయితే ఇలాంటి అరుదైన ఘటన దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో జరిగింది. అసలేమైందంటే...


మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య బాక్సింగ్ డే టెస్ట్ జరుగుతోంది. రెండో రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా ఓ ఘటన జరిగింది. దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ చేస్తుండగా మ్యాచ్ ను కవర్ చేస్తున్న స్పైడర్ క్యామ్ ప్రొటీస్ ఫీల్డర్ అన్రిచ్ నోర్ట్జేకు కు తగిలింది. క్యామ్ అమాంతం నేలమీదకు వచ్చి నోర్ట్జేను ఢీకొంది. అతను వెంటనే కింద పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అన్రిచ్ కు ప్రమాదం ఏం జరగలేదు. ఆస్ట్రేలియా స్కోరు 176 పరుగుల వద్ద ఉన్నప్పుడు 46 వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. 






వార్నర్ 'డబుల్'


తన వందో టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. 100వ మ్యాచ్ ఆడుతూ ద్విశతకం చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సుదీర్ఘ జట్టులో స్థానం ప్రశ్నార్థకమైన వేళ, ప్రతిష్టాత్మకంగా భావించే బాక్సింగ్ డే మ్యాచులో, తన వందో టెస్టులో డబుల్ సెంచరీ మార్కును అందుకోవడం వార్నర్ కు ప్రత్యేకంగా నిలిచింది. 


మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో దక్షిణాఫ్రికాతో టెస్టులో ఓపెనర్ గా దిగిన వార్నర్... డబుల్ సెంచరీని అందుకున్నాడు. నాణ్యమైన ప్రొటీస్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ అతడు చేసిన ఈ ద్విశతకం ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. టెస్టు జట్టులో నుంచి తీసేయాలంటూ వస్తున్న విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడీ విధ్యంసక బ్యాట్స్ మెన్. మొత్తం 254 బంతులు ఎదుర్కొని 200 పరుగులు చేశాడు. అందులో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ ద్విశతకంతో అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ తర్వాత వందో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు.


ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు వివరాలు


ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 386 పరుగులు చేసింది. ట్రావెస్ హెడ్ (48), అలెక్స్ కారీ (9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రొటీస్ బౌలర్లలో రబాడ, నోర్జే లు తలా వికెట్ తీసుకున్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ 5 వికెట్లతో చెలరేగి ప్రొటీస్ ను దెబ్బకొట్టాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 197 పరుగుల ఆధిక్యంలో ఉంది.