Rishabh Pant Health Update:  డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత క్రికెటర్ రిషభ్ పంత్... ప్రస్తుతం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పంత్ చికిత్సపై దిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన చికిత్స కోసం అతడిని ముంబైకి తీసుకెళ్లారు. 


రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ నుదురు, వీపు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాలికి తగిలిన గాయం చాలా తీవ్రమైనదని వైద్యులు తెలిపారు. అతని లిగ్ మెంట్ పక్కకు జరిగిందని తెలుస్తోంది. మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ను తాజాగా డీడీసీఏ అధ్యక్షుడు శ్యామ్ శర్మ కలిశారు. అతను తెలిపిన వివరాల ప్రకారం... కాలి లిగమెంట్ చికిత్స కోసం పంత్ ను ముంబయి తరలించారు. లిగమెంట్ అనేది ఎముకలను కలిపి ఉంచే ఒక రకమైన ఫైబర్ లాంటి అవయవం. ప్రస్తుతం పంత్ గాయాలు, అందిస్తున్న చికిత్సపై డీడీసీఏ, బీసీసీఐ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. 


యాక్సిడెంట్ జరిగిందిలా...


రిషభ్ పంత్ దిల్లీ నుంచి తన స్వస్థలం ఉత్తరాఖండ్ కు స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా.. రూర్కీ సమీపంలో కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. అటుగా వెళ్తున్నహర్యానా ఆర్టీసీ బస్ డ్రైవర్, కండక్టర్ పంత్ ను కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ ప్రమాదం నుంచి పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతని నుదురు, వీపు, కుడికాలు వద్ద గాయాలయ్యాయి. 


డాక్టర్లు ఏమంటున్నారంటే


ప్రస్తుతం తనకు తగిలిన గాయాల నుంచి పంత్ కోలుకునేందుకు కనీసం 2 నుంచి 6 నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఒకవేళ కాలుకి సర్జరీ అవసరమైతే పూర్తిగా కోలుకునేందుకు మరింత టైం పడుతుందని అంటున్నారు. 


ఈ ప్రమాదంతో వచ్చే ఐపీఎల్ కు పంత్ దాదాపు దూరమైనట్లే. రిషభ్ ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి పంత్ దూరమయ్యాడు.