Kohli - Sachin:  క్రికెట్ లో ఒక సామెత ఉంది. రికార్డులు అనేవి బద్దలు కొట్టడానికే ఉంటాయని. అవును ఇది నిజమే. కొందరు ఆటగాళ్లు సృష్టించిన రికార్డులను కొంతకాలం తర్వాత మరికొందరు చెరిపేస్తూ ఉంటారు. ఆ రికార్డులను దాటేస్తూ ఉంటారు. ఇప్పటివరకు అలా చాలా రికార్డులు బద్దలయ్యాయి. అయితే కొంతమంది ఆటగాళ్లు సృష్టించిన రికార్డులు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు అనిపిస్తాయి. అలాంటి ఒక రికార్డ్ భారత లెజెండరీ ఆటగాడు సచిన్ పేరిట ఉంది. అదే వంద సెంచరీలు. అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్ 100 సెంచరీలు చేశాడు.  అలాగే వన్డేల్లో 49 శతకాల రికార్డు. ఈ రెండూ టెండూల్కర్ పేరిట ఉన్నాయి. 


సచిన్ కు దగ్గరగా కోహ్లీ


ఈ రికార్డులను ఎప్పటికీ ఎవరూ అందుకోలేరని కొన్నాళ్ల క్రితం వరకు క్రికెట్ పండితులు, అభిమానులు అనుకున్నారు. అయితే నేనున్నానంటూ దూసుకొచ్చాడు మరో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. నాలుగేళ్ల క్రితం వరకు సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీ సచిన్ వంద వందల రికార్డును బద్దలుకొట్టేలానే కనిపించాడు. ఇప్పటికే అతని ఖాతాలో 72 సెంచరీలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా పేలవ ఫాంతో సతమవుతున్న విరాట్ ప్రస్తుతం ఆ రికార్డును అందుకుంటాడో లేదో తెలియదు కానీ.. టెండూల్కర్ మరో రికార్డును మాత్రం తిరగరాసేందుకు చాలా దగ్గరగా ఉన్నాడు. 


బద్దలు కొట్టేందుకు ఇదే అవకాశం


సచిన్ టెండూల్కర్ ఒక్క వన్డే ఫార్మాట్లోనే 49 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు విరాట్ కోహ్లీకి అవకాశం ఉంది. ఇప్పుడు విరాట్ వన్డేల్లో 44 సెంచరీలతో ఉన్నాడు. మరో 6 సెంచరీలు చేస్తే సచిన్ రికార్డు బద్దలవుతుంది. ఈ ఏడాది టీమిండియా చాలా వన్డేలు ఆడనుంది. అలాగే వన్డే ప్రపంచకప్ కూడా ఉంది. కాబట్టి ఈ రికార్డును చేరుకోవడం కోహ్లీకి పెద్ద కష్టమేమీ కాదు. సచిన్ 1989- 2012 మధ్య కాలంలో 463 వన్డేల్లో 49 శతకాలు అందుకున్నాడు. 2008 నుంచి కోహ్లీ 265 వన్డేల్లో 44 సెంచరీలతో కొనసాగుతున్నాడు. 


అయితే గత నాలుగేళ్లుగా గడ్డు దశను ఎదుర్కొంటున్న కోహ్లీ సచిన్ రికార్డును చెరిపేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. విరాట్ ప్రస్తుతమున్న ఫాంలో మరో 6 సెంచరీలు చేయడమంటే అంత సులభం కాదు. కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే ఈ ఏడాదిలోనే అది జరగాలి. ఎందుకంటే ప్రస్తుతం 34 ఏళ్లున్న విరాట్ ఇంకెంతకాలమో క్రికెట్ లో కొనసాగలేడు. కాబట్టి వన్డే ప్రపంచకప్ కూడా ఉన్న నేపథ్యంలో కోహ్లీ మరో 6 శతకాలు బాది టెండూల్కర్ రికార్డును చెరిపేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.