Shivam Mavi Post Match Interview: శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఫాస్ట్ బౌలర్ శివమ్ మావికి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న శివమ్ మావి వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. తన మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన విజయాన్ని అందించి చిరస్మరణీయంగా మలిచాడు.


భారత విజయంలో శివమ్ మావి కీలక పాత్ర పోషించాడు. తన అరంగేట్ర మ్యాచ్ లో నలుగురు శ్రీలంక ఆటగాళ్ళను ఔట్ చేశాడు. అనుకోకుండా వచ్చిన అవకాశం... తర్వాత అద్భుతంగా రాణించడంతో భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ తర్వాత అతను ఏమి చెప్పాడంటే... 
ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో టీమిండియాను రెండు పరుగుల తేడాతో గెలిపించిన తర్వాత శివమ్ మావి మాట్లాడుతూ "ల్యాండింగ్ జోన్ కొంచెం జారుడుగా ఉంది. అండర్-19 ప్రపంచకప్ ఆడిన తర్వాత ఆరేళ్లుగా ఎదురుచూశాను. ఈ సమయంలో నేను చాలా కష్టపడ్డాను, గాయపడ్డాను. కొంతకాలం, నా కల నెరవేరదని అనిపించింది. అయితే, ఐపీఎల్ ఆడిన తరువాత, భయం కొంచెం తగ్గింది.


అరంగేట్ర మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఈ ఫాస్ట్ బౌలర్... మ్యాచ్ సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదని చెప్పాడు. నిజం చెప్పాలంటే ఐపీఎల్ ఆడితే భయపడాల్సిన అవసరం లేదన్నాడు. ఎవరి పాత్ర ఏంటో వాళ్లకు తెలిస్తే ఒత్తిడి దరి చేరదన్నాడు. 


తన ఫేవరేట్ వికెట్ గురించి అడిగినప్పుడు "మొదటి వికెట్ ఎప్పుడూ నాకు ఇష్టమైనది, నేను ఎల్లప్పుడూ కొత్త బంతితో వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాను. 






మావి తొలి మ్యాచ్‌లో ప్రత్యేక క్లబ్ లో చేరాడు


ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో శివమ్ మావి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. 2016లో అరంగేట్రం చేసిన టీ20లో బరీందర్ స్రాన్ 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 2009లో ప్రజ్ఞాన్ ఓజా తన అరంగేట్ర టీ20లో 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.


ఆరేళ్ల తర్వాత శివమ్ మావి అరంగేట్ర టీ20లోనే చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్ల స్పెల్‌లో 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. టీ20 అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా మావి నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లోనే భారత మహిళా క్రికెటర్ శ్రావణి నాయుడు నాలుగు వికెట్లు పడగొట్టింది.