IND vs SL 1st T20:  యువ భారత్ అదరగొట్టింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో శ్రీలంకపై 2 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు మునివేళ్లపై కూర్చోబెట్టిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది. 


టీ20ల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే భారత యువ బౌలర్ శివమ్ మావి అదరగొట్టాడు. శ్రీలంకతో జరగిన మ్యాచ్ లో మావి 4 వికెట్లతో చెలరేగాడు. అతనితోపాటు హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ తలా 2 వికెట్లతో రాణించటంతో శ్రీలంకపై టీమిండియా  విజయం సాధించింది. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన వేళ స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 2 పరుగుల తేడాతో గెలిచింది. 


163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఓవర్లోనే పాథుమ్ నిస్సాంక వికెట్ ను కోల్పోయింది. అరంగేట్ర బౌలర్ శివమ్ మావి అద్భుత బంతితో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత లంక క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. ధనంజయ డిసిల్వ ను ఔట్ చేసి మావి భారత్ కు రెండో వికెట్ ను అందించాడు. లంక టాపార్డర్ లో కుశాల్ మెండిస్ (28) తప్ప మిగతా వారు రాణించలేదు. అయితే 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తన జట్టును కెప్టెన్ షనక (27 బంతుల్లో 45) ఆదుకున్నాడు. ఓవైపు వికెట్లు పోతున్నా షనక బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చాడు. అతనికి హసరంగా (21) నుంచి మంచి సహకారం అందింది. బలపడుతున్న వీరి భాగస్వామ్యాన్ని శివమ్ మావినే విడదీశాడు. పాండ్య క్యాచ్ ద్వారా హసరంగను ఔట్ చేశాడు. ఆ తర్వాత షనకను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ పంపించాడు. చివర్లో కరుణరత్నే(23) లంకను గెలిపించడానికి విఫలయత్నం చేశాడు. 


ఉత్కంఠ రేపిన చివరి ఓవర్


పేసర్ల కోటా అయిపోవటంతో లాస్ట్ ఓవర్ ను పాండ్య అక్షర్ పటేల్ కు ఇచ్చాడు. అప్పటికి శ్రీలంక విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు కావాలి. స్టైకింగ్ లో ఆ జట్టు బౌలర్ రజిత ఉన్నాడు.  మొదటి బంతినే అక్షర్ వైడ్ గా వేశాడు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతిని కరుణరత్నే భారీ సిక్సర్ గా మలిచాడు. దాంతో విజయ సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులుగా మారింది. అక్కడినుంచే అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐదో బంతికి పరుగులేమీ రాలేదు. ఆరోబంతికి పరుగు తీసే క్రమంలో రజిత రనౌట్ అయ్యాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు అవసరమైన దశలో కరుణరత్నే రనౌట్ గా వెనుదిరగటంతో భారత్ గెలిచింది. 


అరంగేట్రం అదుర్స్


శివమ్ మావి... ఈ మ్యాచ్ తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్ లోనే ఈ యువ బౌలర్ అదరగొట్డాడు. 4 వికెట్లతో చెలరేగాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. మొదటి 2 వికెట్లు మావి ఖాతాలోనే పడ్డాయి. 


అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీపక్ హుడా (41), ఇషాన్ కిషన్ (37), అక్షర్ పటేల్ (31), హార్దిక్ పాండ్య (29) పరుగులతో రాణించారు.