IND vs SL 1st T20:  భారత్- శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా, శ్రీలంక ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ను ఆఖర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ లు ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు అజేయంగా 68 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరి పార్ట్ నర్ షిప్ తో టీమిండియా శ్రీలంక ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (37), హార్దిక్ పాండ్య (29) రాణించారు. లంక బౌలర్లలో రజిత తప్ప బౌలింగ్ చేసిన మిగతా బౌలర్లందరూ వికెట్ తీశారు. 


టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇషాన్ కిషన్ దూకుడుతో తొలి 2 ఓవర్లలోనే 24 పరుగులు రాబట్టింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న లంక బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. శుభ్ మన్ గిల్ (7)ను తీక్షణ ఎల్బీగా ఔట్ చేయటంతో భారత వికెట్ల పతనం ప్రారంభమైంది. వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మెరుపులు ఈ మ్యాచ్ లో కనిపించలేదు. 10 బంతులాడి 7 పరుగులు చేసిన సూర్యను కరుణరత్నే ఔట్ చేశాడు. సంజూ శాంసన్ (5) కూడా ఎక్కువసేపు నిలవలేదు. ముందు వేగంగా పరుగులు చేసిన ఇషాన్ కిషన్ కూడా నెమ్మదించాడు. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్య వచ్చీ రావడంతోనే 2 బౌేండరీలు బాది స్కోరు బోర్డుకు ఊపు తెచ్చాడు. కాసేపు మెరుపులు మెరిపించిన పాండ్య(29) మధుశంకకు చిక్కాడు. ఆ వెంటనే ఇషాన్ కూడా (37) కూడా ఔటయ్యాడు. 


నిలబెట్టిన వారి భాగస్వామ్యం


శ్రీలంక బౌలర్ల ధాటికి టీమిండియా 14 ఓవర్లలో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో దీపక్ హుడా, అక్షర్ పటేల్ లు భారత్ ను ఆదుకున్నారు. తొలుత ఆచితూచి ఆడిన ఈ జంట చివరి 4 ఓవర్లలో రెచ్చిపోయింది. 16వ ఓవర్లో దీపక్ హుడా తీక్షణ బౌలింగ్ లో 2 సిక్సులు కొట్టాడు. ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్లో అక్షర్ మరో సిక్సర్ బాదాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 68 పరుగులు జోడించటంతో ఆట ఆఖరికి టీమిండియా 162 పరుగులు సాధించింది. 


శ్రీలంక బౌలర్లలో రజిత తప్ప బౌలింగ్ చేసిన వారందరూ వికెట్ తీశారు. హసరంగా (4 ఓవర్లలో 22) పొదుపుగా బౌలింగ్ చేశాడు.