Jaydev Unadkat Hat-trick:  రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ హ్యాట్రిక్ సాధించాడు. రంజీ ట్రోఫీలో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు కేవలం 2 ఓవర్లలో 5 వికెట్లు తీసి అబ్బురపరిచాడు. 


తొలి ఓవర్లోనే హ్యాట్రిక్


రంజీ ట్రోఫీలో భాగంగా మంగళవారం దిల్లీ- సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. తన ఓవర్ లో 3, 4, 5 బంతుల్లో దిల్లీ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేశాడు. మొదట ధ్రువ్ షోరే, తర్వాత వైభవ్ రావల్, అనంతరం యుష్ ధుల్ లను పెవిలియన్ పంపించాడు. అంతేకాకుండా కేవలం 2 ఓవర్లలోనే 5 వికెట్లు సాధించాడు. మొత్తం మ్యాచ్ లో 8 వికెట్లు తీశాడు. దీంతో రంజీ ట్రోఫీ మ్యాచ్ లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ తీసిన ఆటగాడిగా ఉనద్కత్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు. 2017- 18 సీజన్ లో వినయ్ కుమార్ మొదటి, 3వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించాడు. 


దిల్లీ విలవిల


ఉనద్కత్ ధాటికి దిల్లీ 133 పరుగులకే ఔటయ్యింది. హృతికి షోకీన్ (68) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌరాష్ట్ర ప్రస్తుతం 46 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలవడం సౌరాష్ట్రకు చాలా కీలకం. 3 గేమ్‌లు ముగిసిన తర్వాత, ఉనద్కత్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు ప్రస్తుతం ఒక విజయం, రెండు డ్రాలతో సహా 12 పాయింట్లతో గ్రూప్ బీలో మూడో స్థానంలో ఉంది. ముంబై, మహారాష్ట్రలు పట్టికలో వరుసగా 1, 2 స్థానాల్లో ఉన్నాయి. 


జాతీయ జట్టులోకి పునరాగమనం


జయదేవ్ ఉనద్కత్ ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్నాడు. అందులో అత్యధిక వికెట్లు తీసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు. 10 మ్యాచుల్లో 3.3 ఎకానమీతో 19 వికెట్లు తీశాడు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో ఈ ఫాస్ట్ బౌలర్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. తొలి టెస్ట్ ఆడిన 12 ఏళ్ల తర్వాత తన రెండో టెస్ట్ ఆడాడు. ఈ మ్యాచులో 2 ఇన్నింగ్సుల్లో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.