IND vs SL ODI: భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కోసం బుమ్రాను బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. దీనికి సంబంధించి ట్విటర్ లో కీలక ప్రకటన చేసింది.
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం ముందు ప్రకటించిన జట్టులో బుమ్రా లేడు. అయితే ఈరోజు బుమ్రాను వన్డే స్క్వాడ్ లో చేర్చినట్లు బీసీసీఐ తెలిపింది. దీనిపై ట్విటర్ లో ప్రకటన విడుదల చేసింది.
'శ్రీలంకతో జరగబోయే 3 మ్యాచ్ ల మాస్టర్ కార్డ్ సిరీస్ కోసం టీమిండియా వన్డే జట్టులో జస్ప్రీత్ బుమ్రాను తీసుకున్నాం. అతను సెప్టెంబర్ 2022 నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. వెన్ను గాయం కారణంగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ లోనూ ఆడలేదు. అయితే నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ) లో పునరావాసం పొందిన బుమ్రా ప్రస్తుతం ఫిట్ గా ఉన్నట్లు అకాడమీ తెలిపింది. అందుకే వన్డే జట్టులోకి బుమ్రాను తీసుకున్నాం. త్వరలో అతను టీమిండియా జట్టుతో కలుస్తాడు' అని బీసీసీఐ విడుదల ప్రకటనలో వివరించారు.
సెప్టెంబర్ 2022లో చివరి మ్యాచ్
బుమ్రా చివరిసారిగా 2022 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో ఆడాడు. ఆ తర్వాత వెన్ను గాయం కారణంగా అతను దక్షిణాఫ్రికాతో సిరీస్, T20 ప్రపంచ కప్ నుంచి తప్పుకున్నాడు. బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ భారత అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి రెండు టెస్టులకు అతను దూరమైనప్పటికీ, 2022లో టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో అగ్రస్థానంలో నిలిచాడు. జులైలో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన టెస్టులో అతను జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
శ్రీలంక వన్డేలకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్. రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్హదీప్ సింగ్.