Rishabh Pant Health Update: భారత స్టార్ వికెట్ కీపర్- బ్యాటర్ రిషభ్ పంత్ డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అతను డెహ్రాడూన్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు హాస్పిటల్ యాజమాన్యం పంత్ ఆరోగ్యానికి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది.
రిషభ్ పంత్ విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడని వైద్యులు తెలిపారు. అతని శరీరంలోని వివిధ భాగాలపై వాపు ఇంకా తగ్గలేదని చెప్పారు. మొన్న పంత్ ను ఐసీయూ నుంచి ప్రైవేట్ రూమ్ కు మార్చారు. 'ప్రస్తుతం రిషభ్ ఇంకా నడవడం ప్రారంభించలేదు. అతని మోకాలు, కాలు, చీలమండలపై గాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇంకా తెలియదు. ఎంఆర్ ఐ స్కాన్ తీసేందుకు పంత్ ఇంకా సిద్ధంగా లేడు.' అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ వైద్యుల బృందం నిరంతరం ఆసుపత్రి వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో పంత్ మోకాలు, చీలమండలకు శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలుస్తోంది.
- పంత్ త్వరలో డిశ్చార్జ్ అవుతాడని, రానున్న రెండు మూడు రోజుల్లో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉంటాడని బీసీసీఐ భావిస్తోంది.
- పంత్‌కు రెండు అనుమానిత లిగమెంట్ చీలికలు ఉన్నాయి.
- గాయాలకు శస్త్రచికిత్స అవసరమా లేదా మాములు చికిత్సతో కోలుకుంటాడా అనేది ఇంకా తెలియదు.
- పంత్ ఇంకా నడవడం ప్రారంభించలేదు.
- పంత్ డిశ్చార్జ్ అయిన తర్వాత BCCI వైద్యుల ప్యానెల్ శస్త్ర చికిత్స కోసం ముంబయికి తీసుకెళ్లవచ్చు.
రిషభ్ పంత్ కోసం టీమిండియా జట్టు తమ ప్రేమ, ప్రార్థనలను తెలియజేసింది. శ్రీలంకతో టీ20 సిరీస్ కు ముందు కెప్టెన్ హార్దిక్ పాండ్య పంత్ గురించి మాట్లాడాడు. జరిగింది చాలా దురదృష్ట ఘటన. దానిని ఎవరూ నియంత్రించలేరు. జట్టంతా తన కోసం ప్రార్థనలు చేస్తోంది. మా ప్రేమ ఎప్పుడూ తనతో ఉంటుంది. పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. జట్టులో అతని పాత్ర ముఖ్యమైనది. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు అని హార్దిక్ అన్నాడు.