Rinku Singh: రింకూ సింగ్‌.... టీ 20 క్రికెట్‌ ప్రపంచంలో ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఐపీఎల్‌ఎలో అయిదు బంతులకు అయిదు సిక్సులు కొట్టిన దగ్గరినుంచి రింకూ పేరు మార్మోగిపోతోంది. విధ్వంసకర బ్యాటర్‌గా రాణిస్తున్న రింకూ సింగ్‌.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో చివరి బంతికి  సిక్సు కొట్టి టీమిండియాకు విజయం అందించాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండి 14 బంతుల్లోనే నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులు చేసిన రింకూపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఆఖరి బంతికి ఒక పరుగు చేయాల్సి ఉండగా.. రింకూ సిక్సర్‌ కొట్టాడు. బౌలర్‌ అబాట్‌ నోబ్‌ వేయడంతో రింకూ సిక్సర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.  చివర్లో దూకుడుగా ఆడాల్సిన స్థితిలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా నిలబడి అతను ఫినిషర్‌గా మ్యాచ్‌ పూర్తి చేశాడు. 


రానున్న ప్రపంచకప్‌లో రింకూ సింగ్‌ కీలక ఆటగాడిగా మారుతాడని అప్పుడే మాజీలు అంచనాలు కూడా వేస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ముగిసిన తర్వా రింకూ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.  ఉత్కంఠభరిత సమయాల్లో ప్రశాంతంగా ఉండటం గురించి మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీతో చర్చించినట్లు రింకూ సింగ్‌ తెలిపాడు. ఒత్తిడి సమయాల్లో ప్రశాంత చిత్తంతో ఆడడాన్ని ధోనీని చూసి నేర్చుకున్నానని రింకూ సింగ్‌ తెలిపాడు. చివరి ఓవర్లో ప్రశాంతంగా ఎలా ఉండాలో ధోనీతో చర్చించానని.. ఒత్తిడిలోనూ తన ప్రశాంతత రహస్యం అదేనని రింకూ సింగ్‌ తెలిపాడు. బౌలర్‌ వైపే సూటిగా చూడాలని ధోని తనకు చెప్పాడని... ఆసీస్‌తో మ్యాచ్‌లో ధోని సూచనలను అమలుపరిచానని రింకూ చెప్పాడు. ‘ఆఖరి బంతి నోబ్‌ అని డ్రెస్సింగ్‌ రూమ్‌లో అక్షర్‌ చెప్పే వరకు తనకు తెలీదని.. సిక్సర్‌ను పరిగణించకపోయినా పట్టించుకోనని.. తాము విజయం సాధించానని అదే తనకు కావాల్సిందని రింకూ చెప్పాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఒత్తిడికి లోను కాకపోవడానికి ధోనీ ఇచ్చిన సూచనలే కారణమని తెలిపాడు. 


మరోవైపు రింకూసింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ వేలంలో రింకూ సింగ్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రిటైన్‌ చేసుకుంటుందని ఒకవేళ అలా జరగకుంటే మాత్రం మిగతా 9 ఫ్రాంచైజీలు అతడికోసం ఎగబడతాయని గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రా  కొనియాడాడు. రింకూది సుదీర్ఘమైన ప్రయాణమని.. అతడు ఈ స్థాయికి చేరడానికి గత ఐదారేండ్లుగా ఎలా కష్టపడుతున్నాడో తమకు తెలుసని కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌  అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నప్పుడు రింకూ సింగ్‌లో సత్తా ఉందని అభిషేక్‌ నాయర్‌ గుర్తించాడని టీమిండియా మాజీ కీపర్‌ దినేష్‌ కార్తిక్‌ తెలిపాడు. అతడు త్వరలోనే అదరగొడతాడని నమ్మాడు. రింకూ దృక్పథాన్ని మార్చిన నాయర్‌అతడిని డెత్‌ ఓవర్లలో ఫినిషర్‌గా సానబట్టాడు.


ఆస్ట్రేలియాతో తొలి టీ20లో జట్టును గెలిపించిన తర్వాత రింకూ తన కోచ్‌ నాయర్‌ను కౌగిలించుకోవడం చూసి ఆనందంగా అనిపించింది. వాళ్లిద్దరి మధ్య బంధం ప్రత్యేకమైంని దినేష్‌ కార్తిక్‌ అన్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో పోరులో వరుసగా అయిదు సిక్సర్లు బాది.. రింకూ కేకేఆర్‌కు సంచలన విజయం అందించాడు. ఐపీఎల్‌ ప్రదర్శన ద్వారానే అతడు జాతీయ జట్టు తలుపు తట్టాడు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply