Abdul Razzaq Comments: మన దేశంపై అసూయ, ద్వేషంతో మరోసారి నోరు పారేసుకున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. నిన్న గాక మొన్న బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అందరూ గడ్డి పెట్టేసారికి  క్షమాపణలు చెప్పిన ఈ పాక్ ఆల్‌రౌండర్.. మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. భారత ఆటగాళ్లను విమర్శిస్తూ స్థాయిని మరింతగా దిగజార్చుకున్నాడు. ఒక ప్రోగ్రామ్ లో  టీమిండియాను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు రజాక్. ఫలితంగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురయ్యాడు.


ఇంతకీ అబ్దుల్ రజాక్  ఏమన్నాడంటే ?


ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడిన రజాక్, పరిస్థితులు అనుకూలించి సొంత గడ్డపై టీమిండియా గెలిచి ఉంటే, క్రికెట్‌కు బాధాకరమైన క్షణాలు మిగిలి ఉండేవన్నాడు. మానసికంగా దృఢంగా ఉన్న టీమే విజేతగా నిలిచిందన్నాడు. అదే భారత్ గనుక ప్రపంచకప్ గెలిచి ఉంటే తాను చాలా బాధపడేవాడిని అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఉంటే మాత్రం భారత్ తప్పకుండా గెలిచేది అని రజాక్ అభిప్రాయపడ్డాడు.


నెటిజన్ల విమర్శలు


అబ్దుల్ రజాక్ చేసిన కామెంట్లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు టీమిండియా గురించి తెలిసే మాట్లాడుతున్నావా అని ఒకరు, ఆటతో కాకుండా ఇలాంటి పనికిరాని వ్యాఖ్యలతో కూడా వార్తల్లో నిలవచ్చని ప్రూవ్ చేసుకుంటున్నావని మరొకరు కామెంట్స్ పెట్టారు. ఫైనల్ మ్యాచులో టీమిండియాకు లక్ కలిసి రాలేదు. అంతే కానీ  భారత్, అద్భుతంగా ఆడిందని గుర్తు చేసిన నెటిజన్లు, అసలు మీ జట్టు పరిస్థితేంటి అని ఆలోచించాలి నువ్వు అంటూ సలహాలిచ్చారు.  


కొద్ది రోజుల క్రితమే క్షమాపణలు


కొద్ది రోజుల క్రితం కూడా ఇలాగే మాట్లాడి తర్వాత క్షమాపణలు చెప్పాడు రజాక్. వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ ప్రదర్శనపై ఓ టీవీ చర్చా వేదికలో అబ్దుల్‌ రజాక్‌, షాహీద్‌ అఫ్రిదీ, ఉమర్‌ గుల్‌,యూనిస్‌ ఖాన్‌, సయీద్ అజ్మల్, షోయబ్‌ మాలిక్, కమ్రాన్‌ అక్మల్‌ పాల్గొన్నారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఉద్దేశం సరిగా లేదని వ్యాఖ్యానిస్తూ అబ్దుల్‌ రజాక్‌.. బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌ పేరును మధ్యలోకి తీసుకొచ్చాడు. క్రికెట్‌ను బాగు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదన్న రజాక్‌ అలాంటప్పుడు మంచి ఫలితాలు ఎలా వస్తాయని విమర్శించాడు. అంతటితో ఆగకుండా తాను ఐశ్వర్యారాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు కదా. ఇది కూడా అంతే అని... అనుచిత వ్యాఖ్యలు చేశాడు.  వ్యాఖ్యలు చేసిన మరుక్షణం నుంచి రజాక్ పై విమర్శల జడివాన కురిసింది. సర్వత్రా విమర్శలు వస్తుండడంతో అబ్దుల్‌ రజాక్ దిగి వచ్చాడు. ఐశ్యర్యారాయ్‌కు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాడు.


అయినా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రజాక్‌కు ఇదే తొలిసారి కాదు. 2021లో పాక్‌ మహిళా క్రికెటర్‌ నిదా దార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహిళలు క్రికెటర్లుగా మారితే.. పురుషులతో సమానంగా ఉండాలనుకుంటారు. లేదా ఇంకా మెరుగ్గా ఉండాలనుకుంటారు. పురుషులే కాదు తామూ కూడా బాగా ఆడతామని నిరూపించుకోవాలని చూస్తారు. దాంతో వాళ్లు అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేసరికి వివాహం చేసుకోవాలనే ఆశ సన్నగిల్లుతుంది. ఇప్పుడు నిదాకు షేక్‌ హ్యాండిస్తే మహిళ అనే భావన కూడా కలగదని రజాక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అప్పట్లో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply