Ricky Ponting Health Issue: ఆస్ట్రేలియా క్రికెట్‌ లెజెండ్‌ రికీ పాంటింగ్‌ ఆస్పత్రి పాలయ్యారని సమాచారం. క్రికెట్‌ కామెంటరీ చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన అస్వస్థతకు గురయ్యారు. కొన్ని వ్యాధి లక్షణాలు కనిపించడంతో హుటాహుటిని ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిసింది.


ప్రస్తుతం వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. పెర్త్‌ వేదికగా ఆతిథ్య జట్టుతో తొలి టెస్టు ఆడుతోంది. రికీ పాంటింగ్‌ ఛానెల్‌ 7లో కామెంటేటర్‌గా పనిచేస్తున్నారు. మూడో రోజు క్రికెట్‌ వ్యాఖ్యానం చేస్తుండగా ఆయన ఇబ్బందికి గురయ్యారు. అక్కడే ఉన్న తన సహచరులకు సమాచారం అందించి ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం తనకు బాగానే ఉందని, శరీరం సహకరించకపోవడంతో ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి వెళ్తున్నానని వారితో పేర్కొన్నారని తెలిసింది.




'రికీ పాంటింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు మ్యాచుకు క్రికెట్‌ వ్యాఖ్యానం చేయరు' అని ఛానెల్‌ 7 అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. 'శనివారం పాంటింగ్‌ వస్తారో రారో ఇప్పుడే చెప్పలేం. మిగిలిన మ్యాచుకు అందుబాటులో ఉంటారో లేదో తెలియదు' అని ఛానెల్‌ ప్రతినిధి అన్నారు.


ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బ్యాటర్లలో రికీ పాంటింగ్‌ ఒకడు. అతడు క్రీజులోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోయేవారు. టీమ్‌ఇండియాతో సిరీసుల్లో అతడు నిలకడగా రాణించేవాడు. 2003 ప్రపంచకప్‌ను త్రుటిలో దాదాసేన నుంచి లాగేసుకున్నాడు. తన కెప్టెన్సీలో ఆసీస్‌కు రెండు వన్డే ప్రపంచకప్‌లు అందించాడు. 2012లో ఆటకు గుడ్‌బై చెప్పేసిన రికీపాంటింగ్‌ కొన్నాళ్లు ఐపీఎల్‌లో ఆడాడు. ఆసీస్‌ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు కోచ్‌గా సేవలు అందించాడు. ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు.


ఏడాది క్రితమే క్రికెట్‌ లెజెండ్‌ షేన్‌వార్న్‌, రాడ్‌మార్ష్‌ ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇప్పుడు రికీ పాంటింగ్‌ గుండె సంబంధ వ్యాధి భయంతో ఆస్పత్రికి వెళ్లాడని తెలియడంతో క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయింది. అతడు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటోంది.


Also Read: ట్వంటీ22 మొనగాడు మిస్టర్‌ 360! రన్స్‌ ఫెస్ట్‌లో సూర్య తర్వాతే రిజ్వాన్‌, కోహ్లీ!


Also Read: వేతన పరిమితి రూ.21,000కు పెంచితే ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లో వచ్చే మార్పులేంటి! ఉద్యోగికి నష్టమా లాభమా?