Most T20I Runs in 2022:


క్రికెట్‌.. క్రికెట్‌.. క్రికెట్‌! 2022లో ఐసీసీ పర్మనెంట్‌, అసోసియేట్‌ జట్లన్నీ విపరీతంగా క్రికెట్‌ ఆడాయి. టెస్టు, వన్డేలను మించి టీ20 ఫార్మాట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ఉండటమే ఇందుకు కారణం. ఎప్పట్లాగే ఈ ఏడాదీ చాలామంది ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం అందర్నీ తలదన్ని అగ్రస్థానంలో నిలబడ్డాడు. మహ్మద్‌ రిజ్వాన్‌, విరాట్‌ కోహ్లీ అతడి తర్వాతే నిలిచారు. టీ20 క్రికెట్లో 2022 టాప్‌ స్కోరర్ల జాబితా మీకోసం!


సూర్యకుమార్‌: ఈ ఏడాది బెస్ట్‌ టీ20 క్రికెటర్‌ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు సూర్యకుమార్‌ యాదవ్‌! బౌలర్‌ ఎవరైనా, పిచ్‌ ఏదైనా మిస్టర్‌ 360  నిలబడ్డాడంటే ఊచకోతే! 2022లో 31 మ్యాచులాడిన సూర్య 46.56 సగటు, 187 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 1164 పరుగులు చేశాడు. టాప్ స్కోర్‌ 117. ఈ ఏడాది 2 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు, 106 బౌండరీలు, 68 సిక్సర్లు బాదేశాడు. ఆఫ్ సైడ్‌ ఎక్కడో బంతి వేస్తే మిడాన్‌లో సిక్సర్లు కొట్టిన తీరు ఎన్నటికీ మర్చిపోలేరు.


మహ్మద్‌ రిజ్వాన్‌: టీ20 క్రికెట్లో పాకిస్థాన్‌ దూసుకెళ్తోందంటే అందుకు మహ్మద్‌ రిజ్వాన్‌ ఒక కారణం. ఓపెనర్‌గా వచ్చి 15-20 ఓవర్ల వరకు ఆడటం అతడి ప్రత్యేకత. ఈ ఏడాది 25 మ్యాచులాడి 45.27 సగటు, 122 స్ట్రైక్‌రేట్‌తో 996 రన్స్‌ సాధించాడు. 10 హాఫ్ సెంచరీలు, 78 బౌండరీలు, 22 సిక్సర్లు కొట్టాడు.


విరాట్‌ కోహ్లీ: మూడేళ్లుగా ఊరిస్తున్న శతకాన్ని టీ20 క్రికెట్లోనే కొట్టాడు కింగ్‌ కోహ్లీ. ఆసియాకప్‌ నుంచి ప్రపంచకప్‌ వరకు తిరుగులేని ఫామ్‌  కొనసాగించాడు. 20 మ్యాచుల్లో 55.78 సగటు, 138 స్ట్రైక్‌రేట్‌తో 781 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు, 66 బౌండరీలు, 26 సిక్సర్లు దంచాడు.


సికిందర్‌ రజా: కఠిన ప్రత్యర్థి ఎవరొచ్చినా బెదరకుండా ఆడాడు జింబాబ్వే సీనియర్‌ ఆటగాడు సికిందర్‌ రజా. ఈ ఏడాది 24 మ్యాచుల్లో 35 సగటు, 150 స్ట్రైక్‌రేట్‌తో 735 రన్స్‌ కొట్టాడు. 5 హాఫ్ సెంచరీలు, 52 బౌండరీలు, 38 సిక్సర్లు సాధించాడు.


బాబర్‌ ఆజామ్‌: ఈ ఏడాది అనుకున్నంత ఫామ్‌లో లేకున్నా టాప్‌-5లో నిలిచాడు బాబర్‌. కెప్టెన్‌గా ఒత్తిడి ఎదుర్కొంటూనే రన్స్‌ చేస్తున్నాడు. 2022లో అతడు 26 మ్యాచుల్లో 31 సగటు, 123 స్ట్రైక్‌రేట్‌తో 735 రన్స్‌ చేశాడు. ఒక సెంచరీ, 5 హాఫ్‌ సెంచరీలు, 83 బౌండరీలు, 10 సిక్సర్లు బాదాడు.


గ్లెన్‌ ఫిలిప్స్‌: టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్‌కు కీలకంగా మారాడు. దూకుడుగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నాడు. ఈసారి 21 మ్యాచుల్లో 44 సగటు, 156 స్ట్రైక్‌రేట్‌తో 716 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 6 హాఫ్‌ సెంచరీలు, 51 బౌండరీలు, 33 సిక్సర్లు దంచాడు.


పాథుమ్‌ నిసాంక: టీ20 క్రికెట్లో పాథుమ్ నిసాంక శ్రీలంకకు ప్రామిసింగ్‌ ఓపెనర్‌గా మారాడు. నిలకడగా పరుగులు చేస్తున్నాడు. ఈ ఏడాది 24 మ్యాచుల్లో 31 సగటు, 112 స్ట్రైక్‌రేట్‌తో 713 రన్స్‌ సాధించాడు. 6 హాఫ్‌ సెంచరీలు, 62 బౌండరీలు, 17 సిక్సర్లు ఖాతాలో ఉన్నాయి.


రోహిత్‌ శర్మ: తన స్థాయి క్రికెట్‌ ఆడకున్నా టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాప్‌-10లో నిలిచాడు. ఈ ఏడాది 29 మ్యాచుల్లో 24 సగటు, 134 స్ట్రైక్‌రేట్‌తో 656 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు, 64 బౌండరీలు, 32 సిక్సర్లు బాదేశాడు.


డీఎస్‌ ఐరీ: ఈ నేపాల్‌ క్రికెటర్‌ టీ20 క్రికెట్లో సంచలనంగా మారాడు. కేవలం 18 మ్యాచుల్లోనే 48 సగటు, 136 స్ట్రైక్‌రేట్‌తో 626 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, 4 హాఫ్‌ సెంచరీలు, 51 బౌండరీలు, 19 సిక్సర్లు అతడి ఖాతాలో ఉన్నాయి.


ఆండ్రీ బాల్‌బిర్నే: టీ20 క్రికెట్లో ఐర్లాండ్‌ ఎలా చెలరేగుతుందో తెలిసిందే. టాప్‌ ఆర్డర్లో బాల్‌బిర్నే ఉండటం అందుకో కారణం. ఈ ఏడాది 27 మ్యాచులాడి అతడు 23 సగటు, 129 స్ట్రైక్‌రేట్‌తో 617 పరుగులు చేశాడు. 4 అర్ధశతకాలు, 56 బౌండరీలు, 31 సిక్సర్లు దంచాడు. ఇక హార్దిక్‌ పాండ్య సైతం ఈ ఏడాది 600+ రన్స్‌ చేయడం గమనార్హం.


నోట్‌: ఈ గణాంకాలన్నీ 2022, డిసెంబర్‌ 2 నాటికే!