EPF News:


కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ భవిష్య నిధి (EPF) వేతన పరిమితి పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. చివరి సారిగా 2014, సెప్టెంబర్లో కనీస వేతన పరిమితిని పెంచారు. ఇప్పుడున్న రూ.15,000 పరిమితిని రూ.21,000 పెంచాలని చాన్నాళ్లుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వారి అభ్యర్థన మేరకు 2023 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన చేస్తుందని చాలా మంది ఆశిస్తున్నారు. ఒకవేళ రూ.21వేలకు పెంచితే ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లో ఎలాంటి మార్పులు వస్తాయంటే!


పింఛను జమ పెంపు


ప్రస్తుతం రూ.15,000 కనీస వేతనం ఉన్నవారే ఈపీఎస్‌ (పింఛను)లో కంట్రిబ్యూట్‌ చేస్తున్నారు. అంటే నెలకు గరిష్ఠంగా రూ.1250 మాత్రమే ఈపీఎస్‌లో జమ అవుతుంది. వేతన పరిమితి రూ.21,000కు పెంచితే పింఛను పథకంలో చేయాల్సిన జమ రూ.1749కి పెరుగుతుంది. ప్రస్తుత విధానంలో యజమాని జమచేసే 12% కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఈపీఎస్‌లోకి వెళ్తుంది. మిగతా 3.67 శాతం ఈపీఎఫ్‌లో జమ అవుతుంది. 


అధిక పింఛను


ఈపీఎఫ్‌ వేతన పరిమితిని పెంచారంటే రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే పింఛను మొత్తం పెరుగుతుంది. (ఉద్యోగి సర్వీస్‌ x చివరి 60 నెలల సగటు వేతనం)/70 సూత్రాన్ని ఉపయోగించి పింఛను లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి 32 ఏళ్లు పనిచేశాడని అనుకుందాం. చివరి ఐదేళ్ల వేతనం రూ.15,000 మించే ఉందనుకుందాం. అప్పుడు చివరి 60 నెలల సగటు వేతనాన్ని రూ.15,000 తీసుకొని లెక్కిస్తారు. ఒకవేళ ఉద్యోగి 20 ఏళ్లకు మించే పనిచేస్తే రెండేళ్లు బోనస్‌ పిరియెడ్‌గా కలుపుతారు. అప్పుడు (34x15,000)/70 అంటే రూ.7286 పింఛను వస్తుంది. వేతన పరిమితి రూ.21,000కు పెరిగితే అందుకొనే పింఛను రూ.2,900 మేరకు పెరుగుతుంది.


పెరగనున్న ఈపీఎస్‌ కవరేజి


ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఉద్యోగి కనీస వేతనం రూ.15,000కు మించితే ఈపీఎస్‌లో చేరేందుకు వీల్లేదు. రూ.21,000కు పెరిగితే పింఛను పథకంలో కొనసాగొచ్చు. పదవీ విరమణ వయసులో పింఛనుకు అర్హత సాధిస్తారు. అయితే ఈపీఎస్‌ పథకంలో చేరితే ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ తగ్గుతుందని ఉద్యోగులు గుర్తించడం ముఖ్యం. ప్రస్తుతం రూ.15,000 మించి కనీస వేతనం పొందేవాళ్ల ఎంప్లాయీ, ఎంప్లాయర్‌ కంట్రిబ్యూషన్‌ రెండూ ఈపీఎఫ్‌లోనే జమ అవుతాయి. వేతన పరిమితి రూ.21,000 అయితే ఎంప్లాయర్‌ కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఈపీఎస్‌లోకి వెళ్తుంది.


తగ్గనున్న ఈపీఎఫ్‌ కార్పస్‌


ప్రస్తుతం నెలకు రూ.1,250గా ఉన్న ఈపీఎస్‌ జమ రూ.1749కి పెరిగితే ఇప్పటికే ఉన్న ఉద్యోగుల ఈపీఎఫ్ కార్పస్‌ తగ్గుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి కనీస వేతనం రూ.30,000 అనుకుందాం. అందులో ఎంప్లాయర్‌ 12 శాతం రూ.3600 ఈపీఎఫ్‌ ఖాతాలోకి వెళ్తాయి. ఈ 12 శాతం కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఈపీఎస్‌ ఖాతాలోకి పోతుంది. కనీస వేతనం రూ.15,000 ఉన్నప్పుడు ఈపీఎస్‌ ఖాతాలోకి వెళ్లే మొత్తం నెలకు రూ.1250 మాత్రమే. మిగిలిన రూ.2350ని ఈపీఎఫ్‌లో జమ చేస్తారు. వేతన పరిమితి పెంపుతో ఈపీఎస్‌లో రూ.1851 జమ చేస్తారు కాబట్టి ఈపీఎఫ్‌లోకి రూ.1749 మాత్రమే వెళ్తుంది.