Ashwin Comments: ద్రవిడ వాదానికి అశ్విన్ మద్ధతు..!! హిందీపై సంచలన వ్యాఖ్యలు చేసిన లెజెండరీ స్పిన్నర్
Ashwin Comments: 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో అశ్విన్ 287 మ్యాచ్ లు ఆడాడు. గతనెలలో రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. తాజాగా అతను మాట్లాడిన వీడియో వైరలైంది.

Ashwin Vs Hindi: భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా సున్నితమైన అంశంపై చర్చ లేవదీశాడు. అధికారిక భాషల్లో ఒకటైన హిందీపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. చెన్నైలో తాజాగా జరిగిన ఒక ఇంజినీరింగ్ కాలేజీ ఈవెంట్లో పాల్గొన్న అశ్విన్.. మాటల మధ్యలో హిందీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశంలోని అధికారిక భాషల్లో హిందీ ఒకటని, అది జాతీయ భాష కాదని పేర్కొన్నాడు. తమిళనాడుకు చెందిన అశ్విన్ తనకున్న భాషా ప్రావీణ్యాన్ని ఈ రకంగా ప్రవర్తించాడు. నిజానికి ద్రవిడ వాదాన్ని బలంగా ప్రతిబింభించే తమిళనాడులో హిందీపై చాలా వ్యతిరేకత ఉంది. గతంలో హిందీని తమ రాష్ట్రంలో రుద్దవద్దని చాలా ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఈ విషయంలో చాలా సార్లు దూకుడుగా ప్రవర్తించింది. మన రాష్ట్రంలో అమల్లో ఉన్నట్లుగా త్రిభాషా సూత్రం తమిళనాడులో అమల్లో ఉండదు. అక్కడ కేవలం తమిళం, ఇంగ్లీష్ భాషలు మాత్రమే నేర్పిస్తారు. ఇక తాజాగా అశ్విన్ మాట్లాడిన వీడియో వైరలైంది. తను ద్రవిడ వాదానికి మద్ధతుగా మాట్లాడాడని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. అలాగే మరికొంతమంది అభిమానులు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఇంతకీ వీడియోలో ఏముందంటే..
ఇంజినీరింగ్ కాలేజీ ఈవెంట్లో భాగంగా అశ్విన్ తో ఉత్సాహంగా అక్కడున్న విద్యార్థులు చర్చించారు. ఈ సందర్భంగా అక్కడున్న విద్యార్థుల్లో ఏయే భాషల వాళ్లు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని అశ్విన్ ప్రశ్నలు అడిగాడు. ఇంగ్లీష్ వాళ్లు ఎంతమంది అని అడగ్గా, చాలా చిన్నమొత్తం సమాధానం వచ్చింది. తమిళ వాళ్లు ఎంతమంది అని అడగ్గా, అక్కడున్న హాల్ దద్దరిల్లి పోయింది. ఇక హిందీ వాళ్లు ఎంతమంది ఉన్నారు అని అడగ్గా, అక్కడ సైలెంట్ వాతావరణం నమోదైంది. దీంతో అశ్విన్ తమాషాగా.. దేశంలోని అధికారిక భాషల్లో ఒకటి హీంది మాత్రమేనని, అదేమీ జాతీయ భాష కాదని చమత్కరించాడు. ఆ తర్వాత తనకు తోచిన విధంగా విధ్యార్థులతో సంభాషించాడు.
నన్ను చాలేంజీ చేస్తే ఎందాకైన వెళతా..
తనకు ఆత్మ విశ్వాసం ఎక్కువని, మాములుగా ఏ విషయాన్ని అంతగా పట్టించుకోనని, కానీ ఈ పని నువ్వు చేయలేవని డీమోరల్ చేస్తే, కచ్చితంగా ఆ పనిని సాధించేదాక వదలబోనని అశ్విన్ చెప్పుకొచ్చాడు. గతంలో తనను కెప్టెన్ కాలేవు అని ఎవరు అనలేదని, లేకపోతే కెప్టెన్ కూడా అయ్యి నిరూపించుకునే వాడినని సరదాగా అన్నాడు. ఇక విద్యార్థులకు కొన్ని టిప్స్ చెప్పాడు. చేసే పనిలో విశ్వాసం ఉంచాలని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మధ్యలో దాన్ని వదలొద్దని పేర్కొన్నాడు. ఇక గతనెలలో అంతర్జాతీయ క్రికెట్ కు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో అత్యంత విజయవంతమైన రెండో భారత బౌలర్ గా నిలిచాడు. 2010లో జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 106 టెస్టులు ఆడి, 537 వికెట్లు తీశాడు. అలాగే 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో కూడా అశ్విన్ రాణించాడు. టెస్టుల్లో 25 సగటుతో 3503 రన్స్, వన్డేలు, టీ20లు కలిపి దాదాపు 900 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 15 ఫిఫ్టీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. 38 ఏళ్ల అశ్విన్ 2025 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు.