Kohli Vs Yuvraj: యువీకి కోహ్లీనే పొగపెట్టాడు - రిటైర్మెంట్ ప్రకటించడానికి విరాటే కారణమని బాంబ్ పేల్చిన మాజీ క్రికెటర్

Robin Uthappa: 17 ఏళ్ల కెరీర్‌లో భారత్‌కు యూవీ చాలా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2019లో రిటైర్మెంట్ యువీ ప్రకటించగా.. అతని రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Continues below advertisement

Yuvraj Retirement: 1983 తర్వాత భారత జట్టు రెండుసార్లు ప్రపంచకప్ సాధించింది. దీని వెనుక స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో కీలకం. తొలిసారి 2007లో భారత్ టీ20 ప్రపంచకప్ సాధించగా, 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో యువీ అయితే ఏకంగా అటు బ్యాట్, ఇటు బంతితో రాణించి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. ఆ సమయంలో క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా, జట్టు కోసం తన ప్రాణాలను కూడా రిస్కులో పెట్టాడు. అలాంటి ఆటగాడిని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గౌరవించలేదని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప బాంబ్ పేల్చాడు. యువీ సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడం వెనకాల కోహ్లీయే కారణమని విమర్శించాడు. 

Continues below advertisement

క్యాన్సర్ పేషంట్ అని తెలిసి..
నిజానికి భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఫిట్ నెస్ లెవల్ బాగా పెరిగింది. స్వయంగా సూపర్ ఫిట్‌గా తయారై కోహ్లీ.. టీమిండియా ప్లేయర్లకే గాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులకు రోల్ మోడల్‌గా నిలిచాడు. అతను జట్టు ఎంపికలో కఠినమైన యోయో టెస్టును ప్రవేశపెట్టాడు. అందులో సాధించిన స్కోరు ఆధారంగానే టీమ్ ఎంపికలో అవకాశం కల్పించాడు. అయితే అప్పటికే క్యాన్సర్ బారిన యువరాజ్‌కి ఈ టెస్టును క్రాక్ చేయడం కష్టంగా మారిందని, అతని ఊపిరితిత్తులు అంత సామర్థ్యాన్ని చూపించలేదని ఉతప్ప పేర్కొన్నాడు. కనీసం అతని ఆరోగ్య లెవల్ ప్రకారం కొన్ని సడలింపులు ఇచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. నిజానికి యువరాజ్ కూడా ఫిట్ నెస్ లెవల్ క్రాక్ చేయడం కోసం కష్టపడ్డాడని ఒకట్రెండు పాయింట్లతో మిస్సయ్యేవాడని, ఈ విషయంలో అతడికి కొన్ని మినహాయింపులు కోహ్లీ కానీ, టీమ్ మేనేజ్మెంట్ కానీ ఇస్తే బాగుండేదని పేర్కొన్నాడు. అయితే మొత్తానికి 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఫిట్‌నెస్ టెస్టు పాసై, జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే ఆ సిరీస్‌లో విఫలవమవ్వడంతో తనను జట్టు నుంచి డ్రాప్ చేశారు. ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ కాలేక, 2019లో యువీ రిటైర్మెంట్ ప్రకటించాడు. 

నా ధోరణి నాదే..
కోహ్లీ కెప్టెన్సీ ధోరణిపై కూడా ఉతప్ప విమర్శలు గుప్పించాడు. తన దారి రహదారి అన్నట్లు కోహ్లీ వ్యవహరిస్తుంటాడని, అది సరికాదని పేర్కొన్నాడు. నిజానికి తాను కాస్త తక్కువ కాలమే కోహ్లీ కెప్టెన్సీలో ఆడినట్లు గుర్తు చేసుకున్నాడు. అయితే పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించాలని, యువరాజ్ ఫిట్నెస్ విషయంలో కాస్త మినహయింపులు ఇచ్చి ఉండాల్సిందని పేర్కొన్నాడు. నిజానికి ఫిట్ నెస్ విషయంలో కొన్ని మినహాయింపులు అడిగినా జట్టు మేనేజ్మెంట్ నుంచి సానుకూలంగా నిర్ణయం రాలేదని తెలిపాడు. ఏదేమైన పరిస్థితులకు తగినట్లుగా ఆటగాళ్లకు అండగా నిలవాల్సిన అవసరం అటు కెప్టెన్ కు, ఇటు టీమ్ మేనేజ్మెంట్ కు ఉందని పేర్కొన్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో యువరాజ్ మూడు ఫార్మాట్లు ఆడాడు. ఎక్కువగా లిమిటెడ్ క్రికెట్ ఓవర్లలోనే ప్రాతినిథ్యం వహించాడు. 2000లో అరంగేట్రం చేసిన యువరాజ్ సింగ్ 2017 వరకు అంతర్జాతీయంగా క్రికెట్ ఆడాడు. 40 టెస్టులాడి దాదాపు 34 సగటుతో 1900 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 11 ఫిఫ్టీలు చేశాడు. ఇక 304 వన్డేలాడిన యువీ.. 36.5 సగటుతో 8701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 52 ఫిఫ్టీలు బాదాడు. ఇక 58 టీ20లు ఆడిన యువరాజ్ 28 సగటుతో 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫిఫ్టీలు ఉన్నాయి. 

Also Read: Ashwin Retirement: అశ్విన్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్ నోరు విప్పాలి - అసలేం జరిగిందని మాజీ చీఫ్ సెలెక్టర్ ప్రశ్నలు

Continues below advertisement