BGT 2025: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత మేటీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సిరీస్ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెబుతున్నట్లు కూల్‌గా ప్రకటించాడు. అయితే సిరీస్ మధ్యలో ఏం జరిగిందో, ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై అటు బీసీసీఐ గానీ, ఇటు టీమ్ మేనేజ్మెంట్ గానీ ఎలాంటి సమాచారం చెప్పడం లేదు. దీనిపై తాజాగా మాజీ స్పిన్నర్, 2020-21 ఆస్ట్రేలియాలో భారత జట్టు విజయం సాధించినప్పుడు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సునీల్ జోషి ప్రశ్నించాడు. అశ్విన్ సడెన్ రిటైర్మెంట్‌పై ఉన్న ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. అసలు మూడో టెస్టు ముగిశకా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడని, రెండు, మూడు టెస్టుల మధ్య ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశాడు. 


జట్టు ప్రణాళికా రాహిత్యం..
ఈ సిరీస్‌లో టీమిండియా చాలా తప్పులు చేసిందని, ఆటగాళ్లను తరచూ మారుస్తూ గందరగోళం నెలకొల్పిందని జోషి భావించాడు. అదే ఆసీస్ మాత్రం చక్కని ప్రణాళికలతో అనుకున్న ఫలితాలను సాధించిందని గుర్తు చేశాడు. అంతగా వికెట్లు తీయకున్నా, ఐదు టెస్టుల్లోనూ నాథన్ లయన్‌ను కొనసాగించడాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అయితే భారత జట్టు మాత్రం అలాంటి చొరవ చూపించ లేకపోయిందని తెలిపాడు. నిజానికి అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లను ఎడాపెడా ఈ సిరీస్‌లో మార్చింది. బ్యాటర్ల విషయానికొస్తే తొలి టెస్టులో ఆడని శుభమాన్ గిల్, రోహిత్ శర్మ స్థానంలో దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్‌లను ఆడించారు. ఇక రెండో టెస్టులో వారిద్దరూ టీమ్‌లోకి రావడంతో పడిక్కల్, జురేల్‌ను తప్పించారు. నాలుగో టెస్టులో రోహిత్ కోసం శుభమాన్ గిల్‌ను తప్పించారు. ఇక ఐదో టెస్టులో రోహితే తప్పుకుని గిల్‌కు దారిచ్చాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే తొలి రెండు టెస్టుల్లో హర్షిత్ రాణా ఆడగా, తను విఫలం అవడంతో తర్వాత రెండు టెస్టులకు ఆకాశ్ దీప్‌సింగ్‌ను ఆడించారు. తను గాయపడగా చివరి టెస్టులో ప్రసిధ్ కృష్ణను ఆడించారు. ఇక స్పిన్నర్లలో తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించగా, రెండో టెస్టులో అశ్విన్‌ను, మూడో టెస్టులో రవీంద్ర జడేజాను ఆడించారు. తనను మూడో టెస్టులో తప్పించారనే మనస్తాపంతో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారని అభిమానులు వాదిస్తున్నారు. ఇక నాలుగు, ఐదు రెండు టెస్టుల్నూలో జడేజా, సుందర్లను ఆడించారు. ఇలా టీమ్ మేనేజ్మెంట్ గందరగోళంగా వ్యవహరించింది. 


బౌలింగ్ లో వైవిధ్యం లేదు..
ఇక బౌలింగ్‌లోనూ వైవిధ్యం కొరవడిందని జోషీ తెలిపాడు. న్యూజిలాండ్, ఆసీస్, ఇంగ్లాండ్ బౌలర్లు లెఫ్టార్మ్ పేసర్లకు తడబడుతారని తెలిసి, జట్టులో అలాంటి బౌలర్లను తీసుకోలేదని పేర్కొన్నాడు. 2020-21 టూర్లో గాయాల కారణంగా నెట్ బౌలర్లుగా ఉన్న ప్లేయర్లను జట్టులోకి తీసుకుని అద్భుతాలు సాధించామని, ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ కొరవడిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా నెట్ బౌలర్లుగా ఉన్న ఖలీల్ అహ్మద్, యశ్‌దయాల్ లాంటి లెఫ్టార్మ్ పేసర్లు ఉన్నప్పటికీ, వారిని వాడుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా జట్టు విఫలమైనప్పుడే అందరి నోళ్లు లేస్తాయని, అదే విజయవంతమైతే తప్పులను కూడా ఎవరూ ప్రశ్నించరని, ఇది ఆటలో సహజమని పేర్కొన్నాడు. ఇక ఎన్సీఏలో ఆసీస్‌కు చెందిన టాయ్‌కూలీ నాయకత్వంలో పేసర్ల శిక్షణ జరుగుతోందని, త్వరలోనే మరింత మంది బౌలర్లు అందుబాటులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 1-3తో భారత్ చేజార్చుకుంది. దీంతో పదేళ్ల తర్వాత ట్రోఫీని ఆసీస్ దక్కించుకుంది. అలాగే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదేళ్ల తర్వాత టాప్-2 నుంచి దిగజారింది. 


Also Read: Aus Open 2025: విషం పెట్టి చంపాలని చూశారు - దేశం నుంచి వెళ్లగొట్టేందుకు నీచంగా ప్రవర్తించారు, టెన్నిస్ సూపర్ స్టార్ సంచలన ఆరోపణలు