దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో ఢిల్లీ(Delhi) జట్టుకు పెద్ద షాక్‌ తగిలింది. పటిష్టమైన ఢిల్లీ జట్టును పుదుచ్చేరి(Puducherry) చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లోనే ఘోరా పరాభవంతో ఢిల్లీ జట్టుకు దిమ్మతిరిగిపోయింది. బలహీనంగా కనిపించిన పుదుచ్చేరి జట్టు.. ఢిల్లీలాంటి బలమైన జట్టును ఓడించడం క్రికెట్‌ విశ్లేషకులను కూడా విస్మయపరిచింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ( Arun Jaitley Stadium in Delhi) మైదానం వేదికగా జరిగిన ఎలైట్ గ్రూప్ డి మొదటి మ్యాచ్‌లో ఢిల్లీను 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరి చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో పుదుచ్చేరి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదీ ఒకటని మాజీ క్రికెటర్లు అంటున్నారు.

 

పుదుచ్చేరి దెబ్బకు విలవిల

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి పుదుచ్చేరి బౌలర్లు చుక్కలు చూపించారు. గౌరవ్‌ యాదవ్‌( Gaurav Yadav) బౌలింగ్‌కు ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. గౌరవ్ ఏడు వికెట్లతో ఢిల్లీ జట్టు పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ కేవలం 148 పరుగులకే కుప్పకూలింది.  తొలి ఇన్నింగ్స్‌లో గౌరవ్‌ యాదవ్‌ 7 వికెట్లతో సత్తా చాటాడు. ఢిల్లీ బ్యాటర్లలో హర్ష్‌ త్యాగీ(34) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పుదుచ్చేరి 244 పరుగులకు ఆలౌటైంది. దీంతో పుదుచ్చేరికి కీలకమైన 96 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రెండో  ఇన్నింగ్స్‌లోనూ ఢిల్లీ ఆటతీరు ఏమీ మారలేదు. మరోసారి పుదుచ్చేరి బౌలర్లు రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ ఢిల్లీ 145 పరుగులకే ఆలౌటైంది.  ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌ యష్ ధుల్(Yash Dhull) దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.  దీంతో పుదుచ్చేరి ముందు కేవలం 51 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పుదుచ్చేరి ఛేదించింది. రెండు ఇన్నింగ్సుల్లో పది వికెట్లు పడగొట్టిన గౌరవ్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.

 

పరుగుల వరద 

 రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో పరుగుల వరద పారుతుంది. సీనియర్‌ బ్యాటర్లు, టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు, యువ క్రికెటర్లు చెలరేగిపోతున్నారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాళ్లు సైతం రెచ్చిపోయారు. కర్ణాటక బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌(devdutt padikkal) భారీ శతకంతో చెలరేగాడు. కేవలం 216 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్సర్లతో 193 పరుగులు చేసి సత్తా చాటాడు. మనీశ్‌ పాండే(Manish Pandey) సైతం మెరుపు శతకంతో టీమిండియా తలుపు తట్టాడు. కేవలం 165 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో మనీశ్‌ పాండే 118 పరుగులు చేశాడు. మరో యువ బ్యాటర్‌ శ్రీనివాస్‌ శరత్‌(Srinivas Sarat) కూడా 76 పరుగులతో రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 514 పరుగుల వత్తా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పంజాబ్‌ సైతం పరుగుల వరద పారిస్తుంది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (85), ప్రభసిమ్రన్‌ సింగ్‌ (83) శతకాల దిశగా సాగుతున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి పంజాబ్‌(Punjab) ఒక్కవికెట్‌ కూడా నష్టపోకుండా 169 పరుగులు చేసి ధీటుగా స్పందిస్తోంది.