Ranji Trophy Players Match Fees Hike: భారత్‌ టెస్ట్‌ క్రికెట్‌కు మరింత ఆదరణ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రయాణిస్తోంది. ఇప్పటికే టెస్ట్‌ క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజు, ఇన్సెంటీవ్‌లు పెంచాలని నిర్ణయం తీసుకున్న బీసీసీఐ... ఇప్పుడు దేశవాళీలోనూ మ్యాచ్‌ ఫీజులు పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. రంజీ ట్రోఫీ ఆడే క్రికెటర్లకు ప్రత్యేక వేతన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడేందుకు ఆటగాళ్లను ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


టెస్ట్ క్రికెటర్ల ప్రోత్సాహక పథకం తర్వాత, రంజీ ఆడే ఆటగాళ్లకు ఎలా రివార్డులు అందించాలన్న దానిపై బీసీసీఐ కసరత్తు చేస్తోందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడే క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా మ్యాచ్ ఫీజులను పెంచాలని బీసీసీఐ యోచిస్తోందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద... ఆటగాళ్లు ఇప్పుడు అందుతున్న రూ. 15 లక్షల మ్యాచ్ ఫీజుతో పాటు ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు రూ. 45 లక్షల వరకు ప్రోత్సాహకం పొందుతున్నారు.  రంజీ ట్రోఫీ కోసం BCCI.... ఒక్కొక్కరికి రోజుకు రూ. 40,000 నుంచి రూ. 60,000 వరకు చెల్లిస్తుంది. ఇది ఒక క్రికెటర్ సీజన్‌లో ఆడిన మ్యాచ్‌లపై ఈ ఫీజు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడే క్రికెటర్లలో 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడిన వారికి లీగ్ మ్యాచ్‌కు రూ.2.40 లక్షలు, నాకౌట్‌ మ్యాచ్‌కు రూ.3 లక్షలు బీసీసీఐ అందజేస్తోంది. 


ముంబై ఆటగాళ్లకు డబుల్‌ బొనాంజ
ముంబై క్రికెట్ అసోసియేషన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ముంబై తరపున రంజీ ట్రోఫీ ఆడే క్రికెటర్లకు అదనంగా మ్యాచ్ ఫీజులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో రంజీ ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు ఇవ్వబోతున్న తొలి అసోసియేషన్‌గా ఎంసీఏ నిలిచింది. ఈ మ్యాచ్‌ ఫీజుకు ఎంసీఏ అందించే మ్యాచ్ ఫీజు అదనం. బీసీసీఐ అందించే మొత్తంతో సమానంగా ముంబై క్రికెటర్లు మ్యాచ్ ఫీజులను అందుకోనున్నారు. అంటే, లీగ్ దశలో రూ. 4.80 లక్షలు, నాకౌట్ మ్యాచ్‌కు రూ. 6 లక్షలు పొందనున్నారు. అలాగే, 21-40 మధ్య ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు రూ. లక్షా, 20 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన వారు రూ. 80 వేలు అందుకోనున్నారు. రంజీ ట్రోఫీని ప్రోత్సహించడం, రంజీ ట్రోఫీ క్రికెట్ ఆడే ప్లేయర్లు ఎక్కువగా సంపాదించాలని భావించామని ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపారు. తదుపరి సీజన్ నుంచి ఎంసీఏ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇటీవల ముంబై జట్టు అజింక్యా రహానే సారథ్యంలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.