దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో ఢిల్లీ(Delhi) జట్టుకు పెద్ద షాక్‌ తగిలింది. పటిష్టమైన ఢిల్లీ జట్టును పుదుచ్చేరి(Puducherry) చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లోనే ఘోరా పరాభవంతో ఢిల్లీ జట్టుకు దిమ్మతిరిగిపోయింది. బలహీనంగా కనిపించిన పుదుచ్చేరి జట్టు.. ఢిల్లీలాంటి బలమైన జట్టును ఓడించడం క్రికెట్‌ విశ్లేషకులను కూడా విస్మయపరిచింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ(Arun Jaitley Stadium in Delhi) మైదానం వేదికగా జరిగిన ఎలైట్ గ్రూప్ డి మొదటి మ్యాచ్‌లో ఢిల్లీను 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరి చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో పుదుచ్చేరి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదీ ఒకటని మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే చిన్న జట్టు చేతిలో ఎదురైన పరాభవంతో కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ను సారధ్య బాధ్యతల నుంచి ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ తొలగించింది. చిన్న జట్టు చేతిలో పటిష్టమైన తమ జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఢిల్లీ అసోసియేషన్ మరో ఆలోచన లేకుండా కెప్టెన్‌పై వేటు వేశారు.

 

కెప్టెన్సీ నుంచి యశ్‌ ధుల్‌ను తొలగించడంపై ఢిల్లీ హెడ్‌ కోచ్‌ దేవాంగ్‌ పటేల్‌ స్పందించాడు. యశ్‌ ధుల్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం సెలెక్టర్ల నిర్ణయమని అన్నాడు. యశ్‌ కెప్టెన్సీ కారణంగా పరుగులు చేయలేకపోతున్నాడని.... యశ్‌ ముందుగా పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. యశ్‌ను పరుగులు చేయనీకుండా నియంత్రించే దేన్నైనా ముందుగా పక్కకు పెట్టాలని.. అందుకే అతడిపై కెప్టెన్సీ భారం దింపేశామని తెలిపాడు. తదుపరి జరిగే మ్యాచ్‌కు యశ్‌ ధుల్‌ స్థానంలో మిడిలార్డర్‌ ఆటగాడు హిమ్మత్‌ సింగ్‌ ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆయుశ్‌ బదోని వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడు.

 

పుదుచ్చేరి దెబ్బకు విలవిల

 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి పుదుచ్చేరి బౌలర్లు చుక్కలు చూపించారు. గౌరవ్‌ యాదవ్‌( Gaurav Yadav) బౌలింగ్‌కు ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. గౌరవ్ ఏడు వికెట్లతో ఢిల్లీ జట్టు పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ కేవలం 148 పరుగులకే కుప్పకూలింది.  తొలి ఇన్నింగ్స్‌లో గౌరవ్‌ యాదవ్‌ 7 వికెట్లతో సత్తా చాటాడు. ఢిల్లీ బ్యాటర్లలో హర్ష్‌ త్యాగీ(34) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పుదుచ్చేరి 244 పరుగులకు ఆలౌటైంది. దీంతో పుదుచ్చేరికి కీలకమైన 96 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఢిల్లీ ఆటతీరు ఏమీ మారలేదు. మరోసారి పుదుచ్చేరి బౌలర్లు రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ ఢిల్లీ 145 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌ యష్ ధుల్(Yash Dhull) దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పుదుచ్చేరి ముందు కేవలం 51 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పుదుచ్చేరి ఛేదించింది. రెండు ఇన్నింగ్సుల్లో పది వికెట్లు పడగొట్టిన గౌరవ్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.